ఎదులాపురం, ఫిబ్రవరి 15 : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. వేదిక, సీటింగ్ ఏర్పాటు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార స్థలాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమం గౌరవప్రదంగా జరిగేలా ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌కు మున్సిపల్ అధికారులు వివరించారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 15 : ఇటీవల జరిగిన నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన 42 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. 13వ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
భైంసా, ఫిబ్రవరి, 15 : భైంసా మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం సబ్ కలెక్టర్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ సంకేత్‌కుమార్ పరిశీలించారు. కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులను లోనికి అనుమతించనున్నా రు. 26 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓటు కలిగి ఉన్నారు.