బాన్సువాడ, జూలై 24: బాన్సువాడ మున్సిపాలిటీలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. కొన్నిరోజులుగా కీలక అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పరిపాలన పై ప్రభావం చూపుతున్నది. దీంతో ప్రజలకు సేవలు అందించడంలో అంతులేని జాప్యం నెలకొంటున్నది. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కుంటుపడగా, కొత్త పనులు ప్రారంభానికి నోచుకోవడంలేదు. గత ఫిబ్రవరి నూతన పాలక వర్గం కొలువుదీరింది. దీంతో మెరుగైన పాలన అందుతుందని అంతా భావించారు. కానీ కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడం పట్టణాభివృద్ధికి కొంత అడ్డంకిగా మారింది. మున్సిపల్లో కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నా, గతంలో ప్రారంభించిన పనులు వేగంగా పూర్తి కావాలన్నా అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. కానీ కీలకవిభాగంలోని పోస్టులు ఖాళీగా ఉండడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బాన్సువాడ మున్సిపల్లో కీలకమైన ఏఈ పోస్టు ఖాళీగా ఉంది. ఫలితంగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. అత్యంత కీలకమైన అసిస్టెంట్ ఇంజినీర్, మేనేజర్ , టీపీవో, ఆర్ఐ, ఆర్వో, సానిటేషన్ ఇన్స్పెక్టర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారి లేకపోవడంతో భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ల పరిశీలన వంటి సేవలు ఆలస్యమవుతున్నాయి. మేనేజర్ పోస్టు ఖాళీగా ఉండడంతో కార్యాలయ పరిపాలన అదుపుతప్పింది. అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉండడంతో పన్నుల వసూళ్లు మందకొడిగా సాగుతున్నది.
శానిటేషన్ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణపై పర్యవేక్షణ, ప్రజారోగ్యచర్యల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మున్సిపల్లో 20 రోజుల క్రితం బోధన్ నుంచి టీపీవోను వారంలో రెండు రోజులు బాన్సువాడకు డిప్యూటేషన్‌పై పంపించారు. మళ్లీ ఆయన అక్కడికే బదిలీ అయ్యారు. బాన్సువాడ మున్సిపల్ పరిధిలో అమృత్ 2.0 పథకం కింద రూ.52 కోట్లతో చేపడుతున్న పనులను పర్యవేక్షించాల్సిన పబ్లిక్ హెల్త్ ఏఈ డిప్యూటేషన్‌పై పనిచేయడంతో పరిస్థితి అధ్వానంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ ) పనులు పూర్తయిననా శుద్ధి యంత్రం అందుబాటులో లేకపోవడం, ముఖ్యంగా వర్షాకాలం ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడం ఇబ్బందిగా మారింది. మురికి కాలువల్లో పూడిక తీయకపోవడంతో దుర్గంధం వ్యాపిస్తున్నది. నిత్యం మున్సిపల్‌కు వివిధ పనులు, ఫిర్యాదులు చేయడానికి ప్రజలు వస్తుంటారు. అన్ని విభాగాల్లో ఇన్‌చార్జిలే ఉండడంతో వారి సమస్యలు త్వరగా పరిష్కారానికి నోచుకోవడంలేదు. మున్సిపల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
బాన్సువాడ మున్సిపల్లో కీలక మైన పోస్టులు ఖాళీగా ఉన్నా యి. దీంతో పాలనపై ప్రభావం చూపుతున్నది. వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలకు ఇబ్బం దులు ఎదురవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. పోస్టుల భర్తీ కోసం కృషి చేస్తున్నాం.
-గోపు గంగాధర్, మున్సిపల్ కమిషనర్