మారుమూల ప్రాంతాలకు సైతం మంచి నీరందించేందుకు సర్కారు చేపట్టిన మిషన్ భగీరథ లక్ష్యం నెరవేరుతున్నది. ఏండ్ల సంది గుక్కెడు నీటి కోసం అరిగోసపడ్డ తండాలకు సైతం శుద్ధజలం చేరుతున్నది. ఇదేకోవలో పాలకుర్తి మండలంలోని భామ్లానాయక్ తండా గ్రామానికి సైతం భగీరథ నీరు చేరింది. ఇంటింటికీ స్వచ్ఛమైన నల్లానీళ్లు అందుతుండడంతో గిరి‘జనం’ మురిసిపోతున్నది. ఇన్నేండ్లకు తమ గొంతుతడిపిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నది.
– పాలకుర్తి, జూన్ 25
పాలకుర్తి మండలంలోని భామ్లానాయక్ తండావాసులు ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం అరిగోసపడ్డారు. ఎండకాలం వచ్చిందంటే మహిళలు బిందెలతో బోరింగ్ల ఎదుట బారులు తీరేవారు. దిక్కుతోచని స్థితిలో ఊరికి దూరంగా ఉండే వ్యవసాయ బావుల వద్దకు పరుగులు తీసేవారు. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇంటింటికీ మంచినీరందించేందుకు మిషన్ భగీరథకు అంకురార్పణ చేసింది. ఇందులో భాగంగా భామ్లానాయక్ తండాకు సైతం కొత్తగా పైప్‌లైన్ వేశారు. 30,000 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకును నిర్మించారు. అయితే, పూర్తిస్థాయిలో నీరందలేదు. ఈ క్రమంలో డయల్ యువర్ ప్రోగ్రాంలో భాగంగా సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ భామ్లానాయక్తండా సర్పంచ్ రాజునాయక్‌కు ఫోన్‌చేసింది.
‘భగీరథ నీరు వస్తుందా..’ అని ఆరాతీసింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఇప్పుడు నిర్మించిన ట్యాంక్ కెపాసిటీ సరిపోవడంలేదని చెప్పారు. మరో ట్యాంక్ నిర్మించాలని కోరగా వెంటనే స్పందించారు. 30వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకు నిర్మించారు. వాటర్‌ట్యాంకు నిర్మించిన గుత్తేదారు నిర్లక్ష్యంతో నీటి కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఏడాది కాలంగా నిరీక్షించిన తండా వాసులు ఇటీవల నిరసనకు దిగారు. సమస్యను తెలుసుకున్న ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి రెండురోజుల్లో వాటర్ ట్యాంకుకు మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్ ఇచ్చి ఇంటింటికీ గోదావరి నీళ్లను సరఫరా చేస్తున్నారు. దశాబ్దకాలంగా తాగునీటికోసం తిప్పలు పడ్డ గిరిజనులకు ఇప్పుడు సురక్షితమైన తాగునీరు అందుతుండడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఇంటికీ నీళ్లు అందుతున్నయి
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గిరిజనతండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా చేసింది. నేను మొదటి సర్పంచ్‌ని, మొదట్లో తండాలో తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. మిషన్‌భగీరథతో ఇప్పుడు ఇంటింటికీ నల్లా నీళ్లు అందుతున్నయి. మహిళల ఆత్మగౌరం పెరిగేలా కృషిచేసిన ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు. గతంలో మా తండాలో 100 కుటుంబాలకు తాగునీరు లేక ఇబ్బంది ఉండేది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వెంటనే పైపులైన్ కనెక్షన్ ఇచ్చి తాగునీరు సరఫరా చేయడంతో తండావాసులు సంతోషంగా ఉన్నారు.
– బదావత్ రాజునాయక్, సర్పంచ్
ఇంటిముందుకే గోదావరినీళ్లు
ఇంటిముందు నల్లాలో గోదావరి నీళ్లు వస్తున్నాయి. చాలా సం తోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్‌భగీరథ పథకం ద్వారానే మేము సంతోషంగా సురక్షితమైన తాగునీరు తాగుతున్నాం.
– భూక్యా రోజా
బోరింగ్నీళ్లకోసం క్యూ కట్టేవాళ్లం
రాత్రి లేదు.. పగలు లేదు.. ఒకప్పుడు తాగునీరు లేక నానా కష్టాలు పడ్డాం. ఉన్న ఒక్క బోరింగ్ వద్ద గంటల తరబడి క్యూ కట్టేవాళ్లం. ఇప్పుడు ఆ బాధ తప్పింది. గిరిజనులను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఎక్కడ గుట్టలో ఏరిపడేసినట్లు అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న మా తండాలకు గోదావరినీళ్లు సరఫరా చేసిన మహానుభావుడు. ఆయనకు రుణపడి ఉంటాం.
– భూక్యా లక్ష్మి
పంచాయతీలతోనే అభివృద్ధి
భూమ్లానాయక్తండాను గ్రామపంచాయతీ ఏర్పాటు చేయడం మూలంగా తమ సమస్యలు తీరాయి. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మిషన్‌భగీరథ పథకం మా ఇండ్ల ముందు ప్రత్యక్షమైంది. గతంలో మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌భగీరథ ద్వారా ఇప్పుడు 24 గంటలు తాగునీరు అందుబాటులోకి తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– భూక్యా జమున
కలలో కూడా అనుకోలె..
మా ఇంటి ముందటికి గోదావరి నీళ్లు వస్తాయని కలలో కూడా అనుకోలె. తాగునీటి కోసం ఏండ్ల పాటు తండ్లాడినం. ఇప్పుడు ఇంటిముందే 24 గంటలు మిషన్‌భగీరథ తాగునీరు రావడం సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతోనే స్వచ్ఛమైన తాగునీరు వస్తంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి కృషిచేయడం మా అదృష్టం
– భూక్యా బుజ్జి