Peddapally | పెద్దపల్లి, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరడం, తాను ఉంటున్న ఎరవల్లిలో కాకుండా నందినగర్ ఇంటికి నోటీసులు అంటించడమై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై భగ్గుమన్నారు.
ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేఖంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా నినదించారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, యువ నాయకుడు దాసరి ప్రశాంత్‌రెడ్డిల ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గ కేంద్రమైన గోదావరిఖని రస్తాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ల ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గంలోని రామగిరి మండలం తెలంగాణ రస్తాలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
నల్ల బ్యాడ్జీలు ధరించి, బైక్ ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అదే విధంగా ధర్మారం మండలం నందిమేడారంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అదే విధంగా కమ్మర్ఖాన్పేటలో, కటికనపల్లిలో మాజీ సర్పంచ్ కారుపాల రాజయ్య ఆధ్వర్యంలో, గోపాల్రావుపేటలో సైతం బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసన వ్యక్తం చేశారు. ధర్మారం మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్‌ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కమాన్‌పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ తాటికొండ శంకర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ముత్తారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఎలిగేడు మండల కేంద్రంలో సైతం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ రెండు మండలాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
జూలపల్లి మండల కేంధ్రంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ ఆధ్వర్యంలో వినూత్నంగా నల్లకండువాలు కప్పుకొని నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఓదెల మండలం పొత్కపల్లిలో నిరసన కార్యక్రమంతో పాటుగా కార్యకర్తలు ధర్నా చేశారు. అంతర్గాం మండలం లింగాపూర్‌లో రామగుండం పట్టణ శాఖ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను జలసమాధి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరళించారు.
ఈ సందర్భంగా వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధూకర్లు మాట్లాడుతూ.. ఇది పూర్తిగా రాక్షసానందం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసన సభ ఉపనేత తన్నీరు హరీష్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావుకు నోటీసులు ఇచ్చి విచారణ జరపగా తాజాగా భరితెగించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కల సాకారం చేసిన ఉద్యమ నేత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి తాను ఎరవెళ్లిలో ఉన్నానని చెప్పినప్పటికీ.. బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అంటివ్వడం చట్టవిరుద్దమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కక్షపూరిత విధానాలకు నిదర్శనమని, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎన్ని నిందలు వేసినా కడిగిన ముత్యంలా బయటికి వస్తారని చెప్పారు.
అప్రజాస్వామికి విధానాలతో కాంగ్రెస్ సర్కారు ఎంతో కాలం ప్రజలను మోసం చేయడలేదని, ప్రజలు అన్ని విషయాలను పూర్తిగా గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తప్పకుండా గుణపాఠం చెబుతారన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మిరాల రాజిరెడ్డి, కౌశిక్‌హరి, పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, మార్కు లక్ష్మణ్, తగరం శంకర్‌లాల్, ఏగోళపు శంకర్‌గౌడ్‌లతో పాటు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.