Government hospital | సిరిసిల్ల టౌన్, మే 30: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో 24-ఎకో పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయని, రోగులకు మరింత విస్తృతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. డయోగ్నస్టిక్ హబ్ ద్వారా నిర్వహిస్తున్న శాంపిల్స్ సేకరణ, రిపోర్టులు వేగంగా అందించాలని, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన వైద్యులు, టెక్నిషియన్స్ నియామకానికి తాత్కాలిక ప్రాతిపదికన, ఎక్కువ వేతనం అందించేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇతర ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న స్టాఫ్ అవసరం మేరకు డిప్యుటేషన్ చేయాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రి ఆవరణలో నీరు నిల్వలేకుండా చూడాలని, బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ నిబందనల ప్రకారం రెగ్యులర్‌గా జరగాలన్నారు. ఎప్పటికప్పుడు సదరం క్యాంపులు నిర్వహిస్తూ దివ్యాంగులకు యూడి ఐడి కార్డులు జారీ చేయాలన్నారు. వేములవాడ ఆసుపత్రి తరహాలో సిరిసిల్ల ఆసుపత్రిలోనూ మెకాల ఆపరేషన్ జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
క్యాన్సర్ వ్యాది లక్షణాలు గల వారిని గుర్తించి వారికి సదరకు పరీక్షలు చేయించాలన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.