ధర్మారం/ గొల్లపల్లి, డిసెంబర్ 15 : బీఆర్ఎస్పై ప్రజలకు ఉన్న చెదరని నమ్మకం వల్లే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా విజయం సాధించారని మాజీ మంత్రి, టీజీబీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన సర్పంచులు ధైర్యంగా ఉండాలని, మరో రెండున్నర ఏళ్లలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని భరోసనిచ్చారు. సోమవారం ఆయన ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించారు. గొల్లపల్లి, ఎండపల్లి మండలాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. సాయంత్రం తర్వాత ధర్మారం మండల కేంద్రంలో నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించి మాట్లాడారు.
గ్రామాల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చేసిన పనులే కనిపిస్తున్నాయని చెప్పారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. ఆ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ధ్వజమెత్తారు. అడ్డగోలు హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన అధికార పార్టీని ప్రజలు తిరస్కరించి తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. మళ్లీ కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.