కలెక్టరేట్, మార్చి 28 : ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని, కేంద్రాలను 49 నుంచి 150కి పెంచుతున్న క్రమంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సమీక్షా సమావేశం నగరంలోని స్వశక్తి భవన్లో శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ఏఈవోలు, ఏపీఎంలు కేంద్రాల నిర్వాహకులకు కొనుగోళ్ల అంశంలో మండలాల వారీగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. తేమ యంత్రాలు సమకూర్చాలని, రైతులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల నమోదు ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని, ధాన్యం రకాలు, నిర్దిష్ట ప్రమాణాలు, తదితర వివరాలు తెలిపే ఫ్లెక్సీ బ్యానర్ కేంద్రాల వద్ద ప్రదర్శించాలని సూచించారు. వచ్చే ఏడాది స్త్రీనిధి రుణాలకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని, అర్హత ఉన్న ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రుణాలు అందజేయాలని స్పష్టం చేశారు. బ్యాంకు లింకేజీ రుణాలు పెంచాలని, లింకేజీ రుణాల నివేదికలు ప్రతి రోజు తనకు పంపించాలని ఆదేశించారు. రానున్న విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం సిద్ధం చేసే అంశంపై చర్చించారు. సమీక్షలో డీఆర్డీవో శ్రీధర్, ఏడీఆర్డీవో సునీత, డీపీఎంలు తిరుపతి, ప్రవీణ్, స్త్రీనిధి అధికారి రవికుమార్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
విద్యానగర్, మార్చి 28: దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని యూడీఐడీ కార్డుల వైద్య పరీక్షల విభాగాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇదివరకే సదరం సర్టిఫికెట్ ఉన్న వారు యూడీఐడీ కార్డుకు దరఖాస్తు చేయవలసిన, వైద్య పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపారు. సదరం లేని వారు మాత్రమే ఆన్లైన్లో లేదా మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వారికి నిర్దిష్ట సమయం, రోజున వైద్య పరీక్షలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ నవీన, డీఆర్డీవో శ్రీధర్ పాల్గొన్నారు.