CP Ghaus Alam | తిమ్మాపూర్, జనవరి 8 : సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం విద్యార్థులకు సూచించారు. మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ క్రైమ్, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ గౌస్ ఆలం ముఖ్యఅతిథిగా వచ్చి మాట్లాడారు. టెక్నాలజీని సరైన పద్ధతిలో సద్వినియోగపరచుకోవాలని సూచించారు. మారుతున్న టెక్నాలజీ అనుకూలంగా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయని ఓటీపీలు, పాస్వర్డ్లు జాగ్రత్తగా మెయింటెన్ చేసుకోవాలన్నారు.
నకిలీ లింకులు, ఉద్యోగ ఆఫర్లు, బంపర్ ఆఫర్ల పట్ల యువత బలవుతున్నారని జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎక్కడైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పొందుపరచవద్దు అన్నారు. అలాగే యువత రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బైక్ పై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనం నడపడం నేరమని సూచించారు. చిన్నచిన్న నిర్లక్ష్యమే కుటుంబాన్ని ప్రమాదంలో పడేస్తుందన్నారు.
మీ భద్రత మీ చేతుల్లో ఉందని సూచించారు. కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్, రోడ్డు భద్రత పై పోలీసుల సూచనలు పాటించి ప్రమాదాలతో పాటు సైబర్ నేరాల నుండి జాగ్రత్త ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం సైబర్ క్రైమ్ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ప్రిన్సిపల్స్ వెంకటేశ్వర్లు, ప్రసాదరాజు, రామనరసింహారెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.