“నిత్యం ప్రజలతో ఉంటూ సమస్యలు పరిష్కరించేవాళ్లు కావాలా..? ఎన్నికలు రాగానే కనిపించే వాళ్లు కావాలా..? ప్రజలు ఆలోచించాలి” అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కోరారు. సమైక్య పాలనలో ధ్వంసమైన కులవృత్తులను కాపాడేందుకే బీసీ వృత్తులకు చేయూత పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతిపక్షాలను నమ్మితే అధోగతేనని అన్నారు. పనిచేసే వారిని ఆదరించాలని కోరారు. శుక్రవారం పద్మనాయక ఫంక్షన్హాల్లో బీసీ చేతివృత్తుల చేయూత పథకం కింద ఎంపికైన 705 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులనుద్దేశించి ప్రసంగించారు.
కార్పొరేషన్, సెప్టెంబర్ 1 : ప్రతి రోజూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే వారు కావాలో, లేక ఎన్నికల సమయంలో ఇష్టారాజ్యంగా వాగ్దానాలు ఇస్తూ మభ్యపెట్టే వాళ్లు కావాలో ఆలోచించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం కరీంనగర్‌లోని పద్మనాయక ఫంక్షన్హాల్లో బీసీ చేతివృత్తుల చేయూత పథకం కింద ఎంపికైన 705 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి, మాట్లాడారు. పేదలకు ఉపయోగపడే బీసీ సంక్షేమశాఖను తన అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రూ. లక్ష సాయం పథకం నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంపదను పెంచి పేదలకు పంచుతున్నారని చెప్పారు.
అందులో భాగంగా దళితబంధు, మైనార్టీ బంధు, బీసీలకు చేయూత పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. నిరుపేద నాయీబ్రాహ్మణుల అభ్యున్నతి కోసం 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌ను ఇస్తున్నారన్నారు. చేయూత పథకాన్ని దశలవారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఒకేసారి అందరికీ ఆర్థిక సహాయం అందించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ సర్కారు అన్ని వర్గాలను సమానంగా చూస్తున్నదని చెప్పారు. బీసీలకు చేయూత లబ్ధిదారులను తమ వృత్తిని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. ప్రభుత్వం పారదర్శంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నదని స్పష్టం చేశారు. ‘దళిత బంధు పథకంతో క్లీనర్ ఓనర్ అయితే.. బీసీలకు చేయూత పథకంతో వరర్ ఓనర్ కావాలి’ అంటూ అభిలషించారు. ఉమ్మడి పాలనలో ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందాలంటే కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు బ్యాంకు లింకేజీ లేకుండా స్కీంలను వర్తింపజేస్తున్నామన్నారు.
నాడు కరీంనగర్ ఎట్లుండె.. నేడు ఎట్లున్నది
గతంలో కరీంనగర్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉస్నదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఉమ్మడి ప్రభుత్వాలు నగరాభివృద్ధికి రూపాయికూడా ఇవ్వలేదని, కానీ కేసీఆర్ సర్కారు వేలకోట్లు వెచ్చించి రూపురేఖలు మారుస్తున్నామన్నారు. గతంలో తలాపునే మానేరు ఉన్నా తాగునీటికి తండ్లాడే పరిస్థితి ఉండేదని..కానీ ప్రస్తుతం నిరంతరం నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్‌తో కరీంనగర్ ప్రపంచ చిత్రపటంలో చోటు దక్కించుకున్నదన్నారు. విదేశీ యాత్రికులు సైతం వచ్చేలా పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. యాభై ఏండ్లు పాలించిన పార్టీ నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారన్నారు. వారి మాటలు నమ్మి అధికారమిస్తే అందినకాడికి దోచుకుంటారని దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్ పాలనవల్లే యావత్ దేశం తెలంగాణవైపు చూస్తున్నదని చెప్పారు. శాంతిభద్రతలు మెరుగ్గా ఉండడంతో రాష్ర్టానికి ప్రపంచస్థాయి కంపెనీలు వస్తున్నాయన్నారు. దీంతో ఇకడి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇప్పటికీ తాగునీరు, కరెంట్ కష్టాలు ఉన్నాయని, కానీ సీఎం కేసీఆర్ ముందుచూపు నిర్ణయాలతో తెలంగాణలో 24 గంటల కరెంట్, పుష్కలంగా తాగు, సాగునీరు అందుబాటులో ఉన్నదన్నారు. వీటిని భేరిజూ వేసుకొని ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి పనిచేసే సర్కారును కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రపుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణీ హరిశంకర్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎంపీపీలు పిల్లి శ్రీలత, లక్ష్మయ్య, ఏఎంసీ చైర్మన్ మధు, బీసీ సంక్షేమాధికారి అనిల్, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
1700 మందికి లబ్ధి
కరీంనగర్ జిల్లాలో బీసీ వృత్తులకు చేయూత పథకం కింద 1700 మంది లబ్ధిదారులకు రూ. లక్ష సాయం అందించాం. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి. దశల వారీగా అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం.
– బీ గోపి, కరీంనగర్ కలెక్టర్
ఎక్కడా లేని పథకాలు ఇక్కడే
దేశంలో ఏరాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ అన్నివర్గాలకు మేలు చేయాలనే తలంపుతోనే ఇలాంటి మహత్తర పథకాలను తెచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ర్టాల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. బీసీ కులవృత్తులకు చేయూత గొప్ప పథకం..ఇది చరిత్రలో నిలిచిపోతుంది. గత పాలకులు బలహీన వర్గాలకు చేసిందేమీ లేదు. ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి పనిచేసే వారిని ఆశీర్వదించాలి.
– వై సునీల్‌రావు, కరీనంగర్ మేయర్