ఆడబిడ్డకు కానుకగా రాష్ట్ర సర్కారు అందిస్తున్న బతుకమ్మ చీర, నేతన్నకు బతుకునిస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో చేతినిండా పని చూపుతూ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఎప్పట్లాగే ఈసారి కూడా సిరిసిల్లకే ఆర్డర్లు ఇవ్వగా, కార్మికలోకం చీరెల తయారీలో తలమునకలైంది. ఇప్పటికే 70 లక్షలకుపైగా చీరెలు ఉత్పత్తి కాగా, మహిళలు మురిసేలా తుది మెరుగులు దిద్దుతున్నది.
ఈ నెలఖారులోగా అనుకున్న లక్ష్యం పూర్తి చేయనుండగా, చేనేత, జౌళీశాఖల యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రాసెస్ అయిన చీరెలను జిల్లాలకు సరఫరా చేస్తున్నది. వచ్చే నెలలో లబ్ధిదారులకు కానుక అందజేసేందుకు సన్నాహలు చేస్తుండగా, చేతి నిండా పని, పనికి తగ్గ కూలితో నేతన్నల కుటుంబాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
– రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ)
నాడు చేనేత కార్మికులను ఎవరూ పట్టించుకోలేదు. సాంచాలు సక్కగ నడువలేదు. పనిలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నరు. ఆకలితో చనిపోయిన్రు. ఇటు సేట్లు కూడా చాలా లాస్ అయిన్రు. సాంచాలను పాత సామాన్లకే అమ్ముకున్నోళ్లు చాలా మందే ఉన్నరు. నేను కూడా సాంచాలు నడువక లాస్ అయిన. ఓ సేటు వద్ద సాంచాలు నడిపిస్తున్న. తెలంగాణ వచ్చినంక కేటీఆర్ సారు మంత్రి కావడం సిరిసిల్లకు కలిసి వచ్చింది. నాడు ఇక్కడ ఒకే రకమైన బట్ట తయారు చేసినోళ్లంతా ఇయ్యాళ రకరకాల వెరైటీలు తయారు చేస్తున్రు. బతుకమ్మ చీరెలతో బతుకుదెరువు దొరికింది.
బతుకమ్మ చీరెల తయారీతో రోజుకు రూ.800 వస్తున్నది. ఆడుతూ పాడుతూ నెలకు రూ.20వేలు సంపాదిస్తున్నం. తెలంగాణ వచ్చినంకనే సిరిసిల్ల సాంచాలకు మంచి రోజులొచ్చినయ్. కార్ఖాన్లు మంచిగా నడుస్తున్నయ్. ఒకప్పుడు పనికోసం ఇక్కడోళ్లు మహారాష్ట్రకు పోతే, ఇయ్యాళ ఎక్కడెక్కడ నుంచో పని కోసం సిరిసిల్లకే వస్తున్నరు. ఇదంతా కేటీఆర్సారు చెయ్యవట్టె సాధ్యమైంది. ఆ సారుకు మేమెప్పుడూ రుణపడి ఉంటం.
– కోడం వేణుగోపాల్, మరమగ్గాల కార్మికుడు (తంగళ్లపల్లి)
నేతన్నకు చేతినిండాఉపాధి
బతుకమ్మ చీరెల ఉత్పత్తి శరవేగంగా అవుతున్నది. కార్మిక క్షేత్రంలో సరికొత్తగా 25 రంగులు.. 625 డిజైన్లలో రూపుదిద్దుకుంటున్నది. ఇప్పటికే కోటి చీరలకు 70 లక్షల చీరెలు సిద్ధం కాగా, యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ చేయిస్తూ, జిల్లాలకు సరఫరా చేస్తున్నది. ఈ నెలఖారు నాటికి మిగతావి పూర్తి కానుండగా, వచ్చే నెలలో ఆడబిడ్డలకు కానుక అందించనున్నది.
భీవండి కన్నా ఇక్కడే మంచిగున్నది
మాది బద్దెనపల్లి. ఇంతకుముందు ఇక్కడ సరైన సాంచాల పనిలేక ఇరవై ఏండ్ల కింద నేను మహారాష్ట్రలోని భీవండి బాటపట్టిన. భార్యాపిల్లల్ని వదిలిపెట్టి పోయిన. అక్కడ సిన్న కోటర్లో పది మంది కలిసి ఉన్నం. పదేళ్లు అక్కడే పన్జేసిన. రెక్కలు ముక్కలు చేసుకున్న. అయినా పాయిదా లేకుండె. ఏడేండ్ల కింద మళ్ల మా ఊరికొచ్చిన. తెలంగాణ వచ్చినంక సాంచాలకు, మా కార్మికులకు చేతినిండా పని దొరికింది. కేటీఆర్ సారు ఉన్నడు కాబట్టే బతుకమ్మ చీరెలు జోరుగా నడుత్తున్నయ్. నాడు ఎంతజేసినా పొట్టకే సాలలే. ఇప్పుడు మంచిగ పనిచేసుకుంటే నెలకు రూ.15 వేల నుంచి రూ.18 వేలత్తన్నయ్. బట్ట పొట్ట ఎల్తంది. కొడుకు, బిడ్డ ఎంబీఏ సదువుతున్నరు. కేటీఆర్ సారు సిరిసిల్లల కాలేజీలు కూడా ఏర్పాటుజేసిండు. ఇంకెక్కడికో పోయి ఉద్దరించేదేమున్నది. ఇక్కడే పని మంచిగుండంగ.
– మ్యాన గణేశ్, మరమగ్గాల కార్మికుడు (బద్దెనపల్లి)
పండుగలా ఉత్పత్తి
మరమగ్గాల పరిశ్రమలో రాష్ట్రంలోనే సిరిసిల్ల మొదటి స్థానంలో ఉండగా, 16 వేల సాంచాలపై బతుకమ్మ చీరెలు ఉత్పత్తి చేస్తున్నారు. ఈసారి కోటి చీరెలకు గాను ఇప్పటికే 70 లక్షల చీరెలు ఉత్పత్తి చేశారు. ఈ నెలఖారులోగా పూర్తి చేసి, వచ్చేనెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలకు చీరెలను పంపి ణీ చేయాలన్న లక్ష్యంతో వేగం మరింత పెంచారు. మిగతా 4 కోట్ల మీటర్లు పూర్తి చేసే పనిలో తలమునకలయ్యారు. రోజుకు పది లక్షల మీటర్లు ఉత్పత్తి చేస్తున్నారు. కార్మిక క్షేత్రంలో సాంచాల సవ్వళ్లతో పండుగ వాతావరణం కనిపిస్తుండగా, తయారైన వస్ర్తాన్ని వెంటవెంటనే సిరిసిల్ల, తంగళ ్లపల్లిలోని ప్రాసెసింగ్ యానిట్లకు తరలిస్తూ, తుదిమెరుగులు దిద్దుతున్నారు. గడువు సమీపిస్తుండడంతో మిగిలిన వాటిని హైదరాబాద్‌లోని కాటెదాన్ ప్రాసెసింగ్ యూనిట్లకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి జిల్లాలకు సరఫరా చేస్తున్నారు.
మా బతుకులు మారినయ్
మాది తంగళ్లపల్లి మండలం. నేను చిన్నప్పటి సంది సాంచాల పనిజేత్తున్న. ఇప్పుడు వార్పిన్ నడిపిస్తున్న. సిరిసిల్లలో ఎప్పుడు ముతక రకం బట్ట తయారైతుండేది. కేస్మీట్ పోయినంక పాలిస్టర్ తెల్లబట్ట ఆర్డరొచ్చింది. ఈ బట్ట తయారుజేస్తే నెలకు 10 వేల నుంచి 12 వేల రూపాయలే వత్తుండె. అది నెలకు మూడు వారాలే పని ఉంటుండె. మిగిలిన రోజులు పనిలేక ఉత్తగనే ఉండుడైతుండె. కేటీఆర్ సార్ దయవల్ల ఆరేండ్ల సంది బతుకమ్మ చీరెలు నడుత్తున్నయ్. నెలకు 18 వేల నుంచి 20 వేల పగారా వస్తున్నది. నెలకు పింఛను 2016 వత్తున్నయ్. బతుకమ్మతోనే మా బతుకులు మారినయ్. ఇది మేం గర్వంగా జెప్పుకుంటం. బిడ్డ పెండ్లిజేసిన. కొడుకు ప్రైవేటుల జాబ్ జేస్తండు. బతుకమ్మ జెయ్యవట్టి మా బతుకులు కొంచెం మెరుగైనయ్. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటం. సార్ జెయ్యవట్టే సిరిసిల్ల ఇంత మంచిగైంది.
– సామల నర్సయ్య, వార్పిన్ కార్మికుడు (తంగళ్లపల్లి)
పని మంచిగున్నది
మాది బద్దెనపల్లి టెక్స్టైల్స్ పార్కు. నేను బీడీలు చుట్టే పనిచేస్త. రోజుకు వెయ్యి బీడీలు చేస్తే రూ.200 కూలీ వస్తది. నెల రోజుల నుంచి ప్రాసెసింగ్ యూనిట్లో బతుకమ్మ చీరెల ప్యాకింగ్ చేస్తున్న. రోజుకు రూ.400 వరకు సంపాదిస్తున్నం. బతుకమ్మ చీరెలున్నన్నీ రోజులు బీడీలు బంద్ పెడుతం. ఇంకో 20 మంది పనిచేస్తున్నం. పని మంచిగున్నది. ఎప్పుడు ఉంటే బాగుంటుంది. కేటీఆర్ సార్‌తోనే సిరిసిల్లకు బతుకమ్మ చీరెల ఆర్డర్లు వచ్చినయ్. అందరికీ పని దొరికింది.
– యెల్దండి సంజన, టెక్స్టైల్స్పార్క్
కార్మికుల్లో సంతోషం
తెలంగాణ రాక ముందు నేతన్నల పరిస్థితి దారుణంగా ఉండేది. కనీసం కూలీ గిట్టుబాటు కూడా అయ్యేది కాదు. ఎంత కష్టపడినా నెలకు ఆరేడు వేలు కూడా వచ్చేది కాదు. ఈ పరిస్థితుల్లో కుటుంబాల భారం మోయలేక ఎంతో మంది ఆత్మహత్యల బాట పట్టారు. భార్యాపిల్లలను వదిలి, ఊళ్లను విడిచి పనికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కానీ, స్వరాష్ట్రంలో వస్త్రపరిశ్రమ పునర్జీవం పోసుకోవడంతో తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరితోపాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా కార్మికులు సిరిసిల్లకు వచ్చారు. మంత్రి కేటీఆర్ చొరవతో బతుకమ్మ చీరెలు రాగా, చేతినిండా పని దొరికింది. ఐదు నెలలకుపైగా నిరంతరం పని ఉంటున్నది. అలాగే, సర్కారు ఇతర ఆర్డర్లు ఇస్తూ ఉపాధి చూపుతున్నది. దాంతో నెలకు 18 వేల నుంచి 20 వేలు వస్తుండగా, కార్మికులు ధీమాగా ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితోనే తాము సంతోషంగా బతుకుతున్నామని చెబుతున్నారు. ఆ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ) : నాటి ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల, స్వరాష్ట్రంలో పునర్జీవం పోసుకుంటున్నది. రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవతో నేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపుతున్నది. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర ఐటీ, చేనేత, జౌళీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేటీఆర్ చేనేత రంగ బలోపేతం కోసం ప్రత్యేక చొరవ చూపారు. నేతన్నల ఉపాధికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇక్కడి వస్త్ర పరిశ్రమపై అధ్యయనం చేశారు. అందులో భాగంగానే బతుకమ్మ కానుకగా ఆడబిడ్డలకు చీరెలు అందించడంతోపాటు నేతన్నకు ఉపాధి చూపి ఆదుకోవాలన్న లక్ష్యంతో 2017 నుంచి బతుకమ్మ చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఏటా బతుకమ్మ చీరెల ఆర్డర్లను సింహభాగం సిరిసిల్లకే ఇస్తూ బతుకుపై ధీమా కల్పించారు.
15వేల మందికి ఉపాధి
బతుకమ్మ చీరెల ఆర్డర్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మంది దాదాపు 5 నెలల పాటు ఉపాధి పొందుతున్నారు. తెలంగాణతోపాటు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిషాకు చెందిన వందలాది మంది కార్మికులు చీరెల తయారీలో తలమునకలయ్యారు. కార్మికులు, ఆసాములు, యజమానులు, ఆటోవాలాలు, ట్రాన్స్‌పోర్టు యజమానులు, హమాలీలు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ నాణ్యమైన చీరెలు రూపొందిస్తున్నారు.
ఆడబిడ్డలు మెచ్చేలా..
ఎప్పటిలాగే ఈసారి చీరెల తయారీలో అధికారులు ఎక్కడా రాజీపడకుండా ముందుకు సాగుతున్నారు. రంగులు, డిజైన్లు, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆడబిడ్డలు మెచ్చే లా 25 రంగులు, 625 డిజైన్లతో అద్భుతంగా రూపొందిస్తున్నారు. అందుకు నాణ్యమైన ముడిసరుకును ఉపయోగిస్తున్నారు. గుజరాత్ నుంచి జరీ, యార్న్ తెప్పించి వాడుతున్నారు. ఐదున్నర గజాలతోపాటు ప్రత్యేకంగా తొమ్మిది గజాల చీరెలను నేయిస్తున్నారు. చీరెలకు జాకెట్ పీస్ సిద్ధం చేస్తున్నారు.
ఫినిషింగ్ అవుతున్నయ్
మండేపల్లిలోని మా ప్రాసెసింగ్ యూనిట్లో బతుకమ్మ చీరెల ఫినిషింగ్ చేస్తున్నం. ఇప్పటి వరకు చేనేత జౌళీ శాఖ 30 లక్షల మీటర్లు ఇచ్చింది. ప్యాకింగ్ కూడా వెంట వెంట చేస్తున్నం. ఇక్కడి నుంచే హైదరాబాద్‌కు పంపిస్తున్నం. జిల్లాలో రెండు ప్రాసెసింగ్ యూనిట్లున్నయ్. ఒక్కో యూనిట్లో 50 మంది వరకు పనిచేస్తున్నరు. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులు పనిచేస్తున్నరు. ఇక్కడి ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు హైదరాబాద్‌లోని యూనిట్లలో చీరెలు ఫినిషింగ్ అవుతున్నయ్.
– బొట్ల వెంకటస్వామి, ప్రాసెసింగ్ యూనిట్ యజమాని