కరీంనగర్ కార్పొరేషన్/ సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 22 : తెలంగాణ ప్రాంతంలో ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగపై రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ అస్థిత్వంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నదని, ఆయన ఆటలను ఎప్పటికీ సాగనీయబోరని స్పష్టం చేశారు.
సోమవారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణభవన్, కరీంనగర్‌లోని జ్యోతిరావు ఫూలే గ్రౌండ్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆమె మాట్లాడారు. పూలనే గౌరమ్మగా కొలుచుకునే అద్భుతమైన పండుగ బతుకమ్మ అని కీర్తించారు.
ఆంధ్రాపాలనలో బతుకమ్మ వివక్షకు గురైందని, కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రపంచానికి చాటేలా ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు. గ్రామగ్రామానా వేడుకలకు సకల సౌకర్యాలు కల్పించారని, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలు అందించారని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ చిన్నచూపు చూస్తున్నదని మండిపడ్డారు. పండుగ పూట బతుకమ్మ ఆడుకోవాల్సిన మహిళలను యారియా కేంద్రాల వద్ద క్యూలో నిల్చునే దౌర్భాగ్య స్థితి తెచ్చిందని వాపోయారు.
ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి మహిళలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను విస్మరించారని మండిపడ్డారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 కానీ, నిరుద్యోగ భృతి , విద్యార్థులకు స్కూటీలు ఏవీ అందించలేకపోయారని ఆగ్రహించారు. అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం, తులం బంగారం ఇస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయో? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మను తీసేసి తన పార్టీ గుర్తు అయిన చేయి గుర్తును పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. కనీసం మహిళలకు బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో పాలన కుటుంబడిపోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ పాలనపై విసిగిపోయిన మహిళాలోకం నేడు కేసీఆర్ పాలన మళ్లీ కావాలని కోరుకుంటున్నదని స్పష్టం చేశారు. కేటీఆర్ నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వర్షంలోనూ ఉత్సాహంగా వేడుకలు
కరీంనగర్లో ఓ వైపు వర్షం పడుతున్నా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాత్రం మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ పాల్గొని బతుకమ్మ ఆడారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఆటాపాటలతో సందడి చేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఎత్తయిన బతుకమ్మ వద్ద మహిళలు ఆడి పాడారు. ‘సారే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల, దేఖ్లేంగే’ పాటలపై రెట్టింపైన ఉత్సాహంతో పాల్గొన్నారు.