వెల్గటూర్, డిసెంబర్ 2: అబద్ధాల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, స్కాంల కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డివి కుళ్లు రాజకీయాలని, వారి మాటల్లో నిజం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎండగట్టారు. దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల పాలనలోని రాష్ర్టాల కన్నా అన్ని రంగాల్లో మనమే నంబర్ వన్ స్థానంలో ఉన్నామని స్పష్టం చేశారు. వారు పబ్బం గడుపుకొనేందుకే తెలంగాణ ప్రభుత్వంపై లేని పోని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అలాంటి వారికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు, ఎండపల్లి మండలాల్లో మంత్రి ఈశ్వర్ శుక్రవారం పర్యటించారు. ఎండపల్లి మండలం గుల్లకోట, వెల్గటూర్ మండలం జగదేవ్‌పేట గ్రామాల్లో కోటీ 50 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు.
రాజారాంపల్లిలో ముంబైకి చెందిన చోటా మహారాజన్ సంస్థ నుంచి ఫ్రాంచైజ్ ద్వారా 100 సీట్ల సామర్థ్యంతో ఇగ్లూ మోడల్లో నిర్మించిన మినీ థియేటర్‌ను మంత్రి ప్రారంభించారు. స్థానిక నాయకులతో కలిసి థియేటర్లో సినిమా చూశారు. అనంతరం 36 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి కొప్పుల మాట్లాడారు. వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన షర్మిల అవినీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి మండిపడ్డారు. ఆంధ్రాలో అన్న అధికారాన్ని అనుభవిస్తున్నాడని, తెలంగాణలో అధికారం చేపట్టాలని కలల కని పాదయాత్ర పేరిట షర్మిల బీజేపీ కనుసన్నల్లో పని చేస్తున్నదని విమర్శించారు.
రాష్ట్రంలోని ప్రతి పక్ష పార్టీల నాయకులు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేస్తున్నారని, ప్రాజెక్టు నిర్మించిందే 82 వేల కోట్లతో ఐతే లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని నిలదీశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కునుమల్ల లక్ష్మి, జడ్పీటీసీలు సుధారాణి, పద్మజ, సర్పంచులు గెల్లు చంద్రశేఖర్, మారం జలేందర్‌రెడ్డి, గంగుల నగేశ్, బోడకుంటి రమేశ్, ముల్కల్ల గంగారాం, లక్ష్మీనారాయణ, కొమ్ము రాంబాబు, ఎంపీటీసీ గాజుల మల్లేశం, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, ప్యాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి, ముత్యాల బలరాంరెడ్డి, టీ(బీ)ఆర్ఎస్ మండలాధ్యక్షులు సింహాచలం జగన్, చల్లూరి రాంచందర్ గౌడ్, నాయకులు ఏలేటి కృష్ణారెడ్డి, మొతుకు స్వామి, కంది విష్ణుమూర్తి, మూగల సత్యం, పెద్దూరి భరత్ కుమార్, గుండా జగదీశ్వర్‌గౌడ్, పడిదం మొగిలి, మల్లారెడ్డి, భాస్కర్, మల్లేశ్, శ్రీనివాస్, నిర్వాహకులు చందు, మారం జగన్మోహన్రెడ్డి, మాంకాళి చంద్రశేఖర్, రాజశేఖర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
జగిత్యాల రూరల్, డిసెంబర్ 2: జిల్లా కేంద్రంలో ఈ నెల 7న జరిగే సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పట్టణంలోని టీ(బీ)ఆర్ఎస్ కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.
సభాస్థలి పరిశీలన
జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో ఈ నెల 7న నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. పోలీసులు సభా స్థలంలో బందోబస్తు ఏర్పాట్లను మంత్రికి వివరించారు. ఇక్కడ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవో మాధురి, జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్, నాయకులు ఉన్నారు.