మానకొండూర్, డిసెంబర్ 26 : పాలమూరు ఎత్తిపోతల పథకం, గోదావరి, కృష్ణా బేసిన్ల నీళ్ల వాటాపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మండిపడ్డారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా తెలంగాణలో కేసీఆర్ చరిత్రను ఎవరూ తుడిచి వేయలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ కుటుంబ త్యాగాలు చరిత్రలో చెరగని సత్యాలని గుర్తుచేశారు. మానకొండూర్‌లోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి బండి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి తిట్లదండకం మొదలు పెట్టిన మరుసటి రోజే సంజయ్ కూడా తిట్ల దండకం అందుకుంటున్నారని, ఇది రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని తేల్చిచెప్పారు. కృష్ణా నదీ జలాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం 299 టీఎంసీలకు శాశ్వతంగా అంగీకరించిందన్న ఆరోపణ పూర్తిగా అవాస్తమన్నారు.
దీనిపై పూర్తి సమాచారం కావాలంటే కేంద్ర జలశక్తి మండలి కార్యాలయానికి వెళ్తే దొరుకుందని సూచించారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులపై అనేక అభ్యంతరాలు లేవనెత్తి అడ్డంకులు సృష్టించిన విషయం బండి సంజయ్‌కు తెలియదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో పాలమూరు ప్రాజెక్ట్ దాదాపు 90 శాతం పూర్తయిందని గుర్తుచేశారు. సంజయ్ నిజంగా తెలంగాణవాది అయితే రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న కేసీఆర్‌కు మద్దతుగా నిలువాలని డిమాండ్ చేశారు. పాలమూరు డీపీఆర్ అంశాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకు వెళ్లడంలో, తెలంగాణ ప్రాజెక్టుల కోసం లాబీయింగ్ చేయడంలో సంజయ్ పూర్తిగా విఫలమయ్యాడని ధ్వజమెత్తారు. కల్వల ప్రాజెక్టుకు నిధులు తీసుకురాకుండా.. పాలమూరు ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో మూసి పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ కూల్చివేతలపై ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో రామంచ గోపాల్‌రెడ్డి, శాతరాజు యాదగిరి, రాజు యాదవ్, పిట్ట మధు, శామంతుల శ్రీనివాస్, రాచకట్ల వెంకటస్వామి, బొల్లం అనిల్, శ్యాంసన్, నెల్లి శంకర్ పాల్గొన్నారు.