కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 16: కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నదని, రాష్ట్ర సచివాలయం వద్ద రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అందుకు నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. సోమవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలను డైవర్ట్ చేస్తున్నదని, ఇందులో ఎన్ని అమలయ్యాయి? ఎంత మంది లబ్ది పొందారు? ఎన్ని నిధులు ఖర్చు చేశారు? అనే అంశంపై దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. చేతనైతే గ్యారంటీలపై ప్రజల్లో చర్చ పెట్టాలే తప్ప విగ్రహాల లొల్లి సిగ్గు చేటని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజా పాలన దేనికోసమని, ఎవరికి భయపడి ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరుతో అధికారికంగా ఉత్సవాలు ఎందుకు నిర్వహించడం లేదని, పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నారని, అందుకే తాను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.