Banakacherla project | ధర్మపురి : బనకచర్ల ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమేనని, గోదావరిలో తెలంగాణ వాటను వదులుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి అన్నారు. ధర్మపురి నియోజవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బనకచర్ల ప్రాజెక్టుపై బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్నా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బాబు శిష్యుడు రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు జరిగే అన్యాయాన్ని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం కోసం ఏపీ నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టే పోలవరం-బనకచర్ల లింకే ఈ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతూ తెలంగాణ రాష్ట్రం నీళ్లను ఆంధ్ర కు దోచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలకు చరమగీతం పాడాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడం దుర్మార్గమని, ఇంత వరకు స్కాలర్షిప్లు ఇవ్వలేదని, విద్యార్థులకు ఇస్తామన్న రూ.ఐదు లక్షల విద్య భరోసా కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. విద్యార్థినిలకు స్కూటీలు ఇవ్వలేదని, అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని తీవ్రమైన మోసం చేసినటువంటి మోసకారి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.
అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పది పాసయితే రూ.10 వేలు, ఇంటర్మీడియట్ పాసయితే రూ.15 వేలు, డిగ్రీ పాసయితే రూ.25 వేలు , పీజీ పాస్ అయితే రూ.లక్ష, ఏం ఫీల్, పీహెచ్డీ పూర్తిచేస్తే రూ.5 లక్షలిస్తానని రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా మోసం చేసిందని మండిపడ్డారు. 6 గారంటీలకు, 420 హామీలకు తూట్లు పొడిచి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, బీజేపీ ప్రభుత్వంతో అంటకాగుతూ పదవిని కాపాడుకుంటున్నటువంటి మోసకారి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తక్షణమే గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో బీర్ఎస్ లక్షల మంది విద్యార్థులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BRSV నాయకులు నేరెళ్ల మహేష్, ఆవుల సాయి, రాకేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.