Siricilla BRSV | సిరిసిల్ల టౌన్, జూలై 19: బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ గోదావరి జలాల దోపిడీకి చేస్తున్న కుట్రలో భాగంగా ఈ ప్రాజెక్టు అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బనకచర్ల ప్రాజెక్టుతో జరగబోయే నష్టాన్ని వివరిస్తూ ఏర్పాటుచేసిన కరపత్రాలను స్థానిక కళాశాలల్లో విద్యార్థులకు శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రం గోదావరి నదిలో 200 టీఎంసీల నీటి వాటా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నుండి 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం కోసం ఏపీ నిర్మించతలపెట్టిన అక్రమ ప్రాజెక్టు పోలవరం- బనకచర్ల లింకు ప్రాజెక్టు అని వివరించారు. గోదావరి-కృష్ణా నదుల యాజమాన్య బోర్డులు, కేంద్ర జల సంఘం అనముతులు లేకుండా, అఫెక్స్ కౌన్సిల్లో చర్చ జరగకుండా ప్రాజెక్టు నిర్మించడానికి లేదన్నారు.
కానీ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవేవి లెక్క చేయకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ బకనచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బీజేపీ పూర్తిగా వారికే సహకారం అందిస్తున్నదని ఆరోపించారు. ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తున్నదని తెలిపారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రంలోని బీజేపీకి లొంగిపోయి లోపాయకారిగా సహకరిస్తున్నాడన్నారు.
ఢిల్లీ వేదికగా హైలెవల్ కమిటీకి ఒప్పుకుంటూ సీఎం-రేవంత్ పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారనుందన్నారు. వెంటనే తెలంగాణ సమాజం మేలుకొనపోతే శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కండ్లముందు గోదావారి పొర్లుతున్నా మన పొలాలకు కలుపుకోలేని పరిస్థితి దాపురిస్తుందన్నారు. కోటి జనాభాకు పైగా ఉన్న హైదరాబాద్ మహానగరంలోని ప్రజలకు త్రాగు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ రైతుకు ఎప్పటికీ ఇక బోరు నీళ్లే దిక్కవుతాయని, ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితులు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్ధిపై ఉంటుందన్నారు. ఇక్కడ బీఆర్ఎస్వీ జిల్లా ఇంచార్జి మానాల అరుణ్, టౌన్ ఇంచార్జి దీపక్, నాయకులు వెంకటరమణ, సాయి, బండారి సిరి, శ్రీనాథ్, మాసం ప్రణయ్ తదితర నాయకులున్నారు.