Ramagundam | కోల్ సిటీ, జూలై 7: రామగుండం నగర పాలక సంస్థ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో గల సర్వే నం.56, 57లో గల ప్రభుత్వ భూమిలో కొద్ది రోజులుగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. సర్వే నం.56లో 3.3 ఎకరాల ప్రభుత్వ భూమి, సర్వే నం.57లో 6.24 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొందరు రేకుల షెడ్లు, మరికొందరు ఏకంగా ఇళ్లు నిర్మించుకున్నారు.
ఈ బాగోతంపై నమస్తే తెలంగాణ దిన పత్రికలో ‘ఖాళీ స్థలాలు కబ్జా…’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే. అరుణ శ్రీ స్పందించారు. అక్రమ నిర్మాణాలపై విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో ఆ ప్రభుత్వ భూమిలో వెలిసిన నిర్మాణాలకు ఏలాంటి అనుమతులు లేవని నిర్ధారించారు. దీంతో సోమవారం కమిషనర్ ఆదేశాలతో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఎక్స్కవేటతో ఆ నిర్మాణాలను నేలమట్టం చేశారు.
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా అక్రమ నిర్మాణాలు చేపట్టినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టం చేశారు. కాగా ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.