Bakery | కోల్ సి టీ, మే 4 : గోదావరిఖని నగరంలో బేకరీల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరుతున్నాయి. మొన్నటికి మొన్న నగరంలోని ఓ బేకరీలో కాలం చెల్లిన పదార్థాలతో కేకులు, స్వీట్లు తయారు చేస్తుండగా నగర పాలక సంస్థ అధికారుల తనిఖీల్లో బయటపడిన సంఘటన విధితమే. తాజాగా శనివారం రాత్రి గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ బేకరీలో సమోసాలో ఏకంగా బొంత పురుగు ప్రత్యక్షమైంది. తిలక్ నగర్ కు చెందిన పీక భరత్ అనే యువకుడు మార్కండేయ కాలనీలోని బేకరీకి వెళ్లి సమోసా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ సమోసాను తింటుండగా అందులో బొంత పురుగు రావడంతో బేకరీ యజమానిని అడిగితే అది పక్కన పడేసి మరొకటి తీసుకో అంటూ చేతిలో పెట్టాడని భరత్ పేర్కొన్నాడు.
తాను గమనించడం వల్ల పెద్ద గండం తప్పిందని, ఒకవేళ తిని ఉంటే తనకేమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించాడు. కాగా సమోసాలు బొంత పురుగు వచ్చిందని చెప్పినప్పటికీ సదరు బేకరీ యజమాని సర్వసాధారణంగా తీసుకొని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం గమనార్హం. పక్షం రోజుల కిందటే లక్ష్మీనగర్ లోని ఓ బేకరీలో కాలం చెల్లిన పదార్థాల బాగోతం బయటపడిన మరుసటి రోజే మార్కండేయ కాలనీలోని ఓ ఫ్యామిలీ రెస్టారెంట్లో నాణ్యత లేని పదార్థాలు విక్రయిస్తుండగా మున్సిపల్ హెల్త్ విభాగం అధికారుల తనిఖీల్లో బయటపడిన విషయం విధితమే.
ప్రతీసారి రెస్టారెంట్లు, బేకరీల్లో నామమాత్రంగా తనిఖీలు చేసి జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంగా నగరంలో బేకరీల్లో ఇలాంటి వరుస మోసాలు బయటపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.