Karimnagar | చిగురుమామిడి, ఏప్రిల్ 26: ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవం కోసం ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ అన్నారు. మండల కేంద్రంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.
పార్టీలకతీతంగా అందరం ఐక్యతగా ఉండి అభివృద్ధి కోసం కృషి చేయాలని, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆచార్య జయశంకర్, ఆలె నరేంద్ర, శ్రీకాంతాచారి, పోలీస్ కృష్ణయ్య లాంటి ఎందరో బహుజన నాయకులు పోరాట స్ఫూర్తిని తీసుకోవాలన్నారు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రాణించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లు తో కొంత న్యాయం జరిగిందన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు రామోజీ రాజకుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, పెసరి శ్రీనివాస్, గంగుల లింగం, కుమార్ యాదవ్, లింగమూర్తి, శివాంజనేయులు, సంపత్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.