Doctors’ negligence | పెద్దపల్లి కమాన్, జులై 30 : పెద్దపల్లి మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గత వారం క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలింత మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని తెనుగువాడకు చెందిన ఢిల్లీ హరీష్ భార్య ఉమాదేవి (29) గత మంగళవారం పురిటి నొప్పులతో స్థానిక మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో అడ్మిట్ అయ్యింది. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు మరుసటి రోజు సర్జరీ ద్వారా డెలివరీ చేశారు.
ఆ సమయంలో తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. కాగా, వారం రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఉమాదేవికి మంగళవారం ఒక్కసారిగా కాళ్ళు, చేతులు తిమ్మిర్లు రావడంతో పాటు దురదగా ఉందని వైద్యులకు చెప్పింది. పరీక్షించిన డాక్టర్లు ఆమెకు ఒక ఇంజెక్షన్ వేశారు. దింతో ఉమాదేవి శరీరమంతా వాపు వచ్చి, లో బీపీ కావడంతో వెంటనే డాక్టర్లు ఐసీయూ లోకి తీసుకెళ్లి చికిత్స అందించారు. అప్పటికి ఆమె ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి రేఫర్ చేశారు.
హుటాహుటిన ఆమె ను అంబులెన్సులో తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని హరీష్ తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్ రావు అక్కడికి చేరుకొని మృతిరాలి కుటుంబానికి న్యాయం చేస్తామని నచ్చచెప్పడంతో, వారు ఆందోళన విరమించారు.