కరీంనగర్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ అభివృద్ధి ఒక్కటే గంగుల కమలాకర్‌ను గెలిపిస్తుందని, ఆయన గెలుపు ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. చెప్పిన పనులు చేశామని, చెప్పనివి కూడా చేశామని అన్నారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు రాష్ర్టానికి ఏం చేశాయో..? తొమ్మిన్నరేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందో..? ప్రజల్లో చర్చ జరుగాలని సూచించారు. పార్టీ పక్షాన వంద ఓటర్లకు ఒక నాయకున్ని ఏర్పాటు చేశామని, ఈ నాయకులు వచ్చే 40 రోజుల్లో ఇంటింటికీ తిరిగి మనం చేసిన అభివృద్ధిని, పరిష్కరించిన సమస్యలను ప్రజలకు విడమర్చి చెప్పాలని సూచించారు. ప్రజల కోసం పాటు పడే పార్టీలు, నాయకులను మాత్రమే ప్రజలు గుర్తుంచుకుంటారని, ఈసారి కూడా బీఆర్ఎస్నే ప్రజలు గెలిపించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు.
మరోసారి కేసీఆర్‌కు ఘన విజయాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కరీంనగర్‌ను లండన్, డల్లాస్‌గా తీర్చిదిద్దుతానని చెప్పారని, అదే బాటలో ఇప్పుడు ముందుకెళ్తున్నామని అన్నారు. నగరంలో ఎంత పెద్ద వర్షం పడినా, కాలుకు బురద అంటకుండా ఇంటికి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. అందుకు మన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల చేసిన కృషే ఇందుకు కారణమని చెప్పారు. ఒకప్పుడు ఎంపీగా తాను, మంత్రిగా కేటీఆర్ కేంద్రంపై పోరాడి కొన్ని నిధులు తెచ్చామని, అయితే వాటిని సద్వినియోగం చేసి, అభివృద్ధి చేసిన నాయకుడు మాత్రం గంగుల కమలాకర్ అని అన్నారు. మనం కేంద్రంతో ఎంత కొట్లాడినా ఆశించిన నిధులు మాత్రం ఇవ్వలేదని మండిపడ్డారు.
కరీంనగర్ అభివృద్ధి మన సొంత ఆలోచనతో, నిధులతో జరుగుతున్నదని అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ అని ఆలోచన చేస్తే ఇది ఆచరణ సాధ్యమా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారని, కానీ, దానిని ఆచరణలో పెట్టి చూపుతున్నామని అన్నారు. తెలంగాణ రాకముందు ఒక్క మెడికల్ కళాశాల కూడా సాధించలేని కాంగ్రెస్ నాయకులకు చెంప పెట్టులా ఇపుడు ఉమ్మడి జిల్లాలో నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని అన్నారు. కరీంనగర్ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎంపీగా ఉన్నపుడు ట్రిబుల్ ఐటీ కోసం ప్రయత్నం చేశానని, దానిని సాధించే క్రమంలో పార్లమెంట్ ఎన్నికలు రావడం, తాను ఓడిపోవడంతో పట్టించుకునే వారు లేకుండా పోయారని అన్నారు.
ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీ బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో వాళ్ల పార్టీ అధికారంలో ఉందని, ట్రిబుల్ ఐటీ గురించి ఇప్పటి వరకు ఊసెత్తిన పాపాన పోలేదని అన్నారు. కరీంనగర్‌ను గొప్ప విద్యా కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ రహదారుల గురించి తాను, మంత్రి గంగుల కమలాకర్ ఢిల్లీకి వెళ్లి గొంతు చించుకుని మాట్లాడినా వాటిని పట్టించుకునే నాయకుడు లేడని అన్నారు. మన పార్టీ కేంద్రంలో అధికారంలో లేకున్నా, గొంతెత్తి మాట్లాడి కొన్నింటిని సాధించుకున్నామని అన్నారు.