బీఆర్ఎస్ కంచుకోట అయిన వేములవాడలో కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకుసాగితే అఖండ విజయం మనదేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అధ్యక్షతన శనివారం వేములవాడలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించగా, వినోద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీలో నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన నాయకులు ఉండడం మన పార్టీ అదృష్టమన్నారు. మనమంతా కలిసికట్టుగా పనిచేద్దామని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకువస్తున్న చల్మెడ లక్ష్మీనర్సింహారావును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
– రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ)/ వేములవాడ
రాజన్న సిరిసిల్ల, (నమస్తే తెలంగాణ) సెప్టెంబర్ 30/ వేములవాడ : ‘మనమంతా బీఆర్ఎస్ కుటుంబసభ్యులం.. సమన్వయంతో ముందుకెళ్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మనదే’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేశారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను చూద్దామని, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావును అఖండ మెజార్టీతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు. నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పనిచేసే కార్యకర్తలు బీఆర్ఎస్లో ఉన్నందుకు మనందరం గర్వపడాలన్నారు. శనివారం వేములవాడ సంగీత నిలయంలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు అధ్యక్షతన రెండు వేల మంది ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. చల్మెడను గెలిపించి మన ఐక్యతను చాటుతామని తీర్మానం చేశారు. ఆయన లక్ష్మీనర్సింహారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో చెన్నమనేని రమేశ్‌కు ప్రజల సంపూర్ణ మద్దతు ఉన్నదని, సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తుచేశారు.
ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలని అనేక సార్లు ప్రస్తావించేవారని చెప్పారు. అయితే, కొన్ని ప్రత్యేక కారణాలతో అభ్యర్థిని మార్చామని చెప్పారు. ఎమ్మెల్యే కూడా సమ్మతించారని, ఆయన ఏ ఒక్కరిపై విమర్శలు చేయకపోవడం మంచితనానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు లేవన్నారు. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఐక్యంగా పనిచేసి వేములవాడ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇది బీఆర్ఎస్ కంచుకోట అని, ఇక్కడ కారు జోరు కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను తీసుకెళ్లాల్సిన బాధ్యత శ్రేణులపై ఉందన్నారు. కేసీఆర్ మల్కపేట రిజర్వాయర్‌కు చెన్నమనేని రాజేశ్వర్‌రావు పేరు పెడతామని ప్రకటించడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వేములవాడ గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా
వేములవాడ గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా.. చెన్నమనేని రాజేశ్వరావు ఈ ప్రాంతంలో ఆరుసార్లు గెలిచారు. తదనంతరం కాలం తనను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా దీవించి అసెంబ్లీకి పంపించారు. ఇదే స్ఫూర్తితో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు అఖండ విజయం కట్టబెట్టాలి. తాను ఎమ్మెల్యేగా ఉన్నాలేకున్నా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతా. కార్యకర్తలకు అందుబాటులో ఉంట. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. మనమందరం కలిసికట్టుగా వేములవాడ గడ్డపై గులాబీజెండా ఎగురవేద్దాం. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేద్దాం.
– చెన్నమనేని రమేశ్‌బాబు, వేములవాడ ఎమ్మెల్యే
రమేశ్‌బాబు అడుగుజాడల్లోనే ముందుకెళ్తాం
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆదరణ ఉన్న నియోజకవర్గాల్లో వేమలవాడ నియోజకవర్గం మొందటి జాబితాలో ఉన్నది. అభ్యర్థుల ప్రకటన సందర్భం గా సీఎం కేసీఆర్ మొదట ప్రస్తావించింది మన ఎమ్మెల్యే రమేశ్‌బాబు పేరునే. అరవై ఏండ్లుగా చెన్నమనేని కుటుంబానికి ఇక్కడి ప్రజలతో అనుబంధం ఉన్నది. ఈ గడ్డ ఆ కుటుంబానికి అడ్డ. అయితే కొన్ని ప్రత్యేక కారణాలతో అభ్యర్థి మా ర్పు జరగడంతో ప్రజల్లో భావోద్వేగాలు ఉండడం సహజమే. ఎమ్మెల్యే రమేశ్‌బాబు సలహాలు, సూచనల మేరకు ముందుకెల్దాం. ఈ విషయం లో మరో ఆలోచన లేదు. సీఎంగా కేసీఆర్‌ను, ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉన్నది. ప్రతిపక్షాల అబద్ధాలను ఎండగట్టా లి. తప్పుడు హామీలపై ప్రజలను అప్రమత్తం చే యాలి. తనను గెలిపిస్తే ఎమ్మెల్యే రమేశ్‌బాబు అ డుగుజాడల్లో ముందుకెళ్తా. ఆయన సహకారంతో నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తా.
– చల్మెడ లక్ష్మీనర్సింహారావు, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి
గులాబీ జెండా ఎగురవేద్దాం
వేములవాడ నియోజకవర్గంలో నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబు నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశారు. విరివిగా నిధులు తెచ్చి ఆదర్శంగా నిలిపారు. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. వేములవాడ గడ్డపై గులాబీ జెండా ఎగురవేద్దాం. చల్మెడ లక్ష్మీనర్సింహారావును భారీ మెజార్టీతో గెలిపిద్దాం.. మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసుకుందాం.
– తోట ఆగయ్య , బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు