Manthani | మంథని, డిసెంబర్ 27: శ్రీ అయ్యప్ప స్వామి శోభయాత్రను దీక్షాపరులు, భక్తులు మంథని పట్టణంలో శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి దింతన తోం.. తోం.. అయ్యప్ప దింతన తోం.. తోం.. స్వామియే అయ్యప్ప.. శరణమప్ప అయ్యప్ప.. అంటూ దీక్షా పరులు అయ్యప్ప స్వామి శోభ యాత్రను మంథని పుర వీధుల గుండా వైభవంగా నిర్వహించారు. స్థానిక అయ్యప్ప ఆలయంలో స్వామి వారికి ఉదయం అరట్టు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు గోదావరి నది తీరంలో ఉదయం స్వామి ఉత్సవ విగ్రహానికి దీక్ష పరులంతా చక్ర స్నానాన్ని కన్నుల పండువగా జరిపించారు.
ఆనంతరం ట్రాక్టర్‌పై ప్రత్యేకంగా ఆలంకరించిన మండపంలో వివిధ రకాల పూలతో స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఎరుకలగూడెం, బస్టాండ్, అంబేద్కర్‌క్ , గాంధీక్ , పెంజేరు, తమ్మి చెరువు కట్టల మీదుగా ఆలయం వరకు స్వామి శోభయాత్రను దీక్షా పరులు, భక్తులు ఎంతో వైభవంగా నిర్వహించారు. డీజే సౌండ్స్‌తో అయ్యప్ప స్వామి పాటలకు దీక్షా పరులు ఆనందోత్సవాల మధ్య నృత్యాలు చేస్తూ.. స్వామిని స్మరిస్తూ పాటలు పాడారు. స్వామి ప్రత్యేక రథ ఆలంకరణ, దీక్షా పరుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శోభయాత్రలో వెళ్తున్న స్వామి వారిని భక్తులు దర్శించుకోవడంతో పాటు కానుకలు, హారతులిస్తూ, కొబ్బరి కాయలు కొడుతూ, స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శోభయామానంగా జరిగిన స్వామి వారి ఊరేగింపులో పూజారులు, అయ్యప్ప దీక్షా పరులు పాల్గొన్నారు.