కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 29 : ఎంత సేపు బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనే తప్ప రేవంత్‌రెడ్డికి పరిపాలన చేయాలన్న సోయి లేకుండా పోయిందని మాజీ మేయర్ రవీందర్‌సింగ్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయకుండా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టి మరల్చేందుకు ఇలా కుట్రలు చేయడం సరికాదని సూచించారు. ఇప్పటికైనా సంక్షేమ పథకాలపై దృష్టి సారించాలని, కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిలో మందు, ముక్క లేకుండా దావత్ జరగదని, ఇప్పటికిప్పుడు రాష్ట్రంలోని మంత్రుల ఇళ్లలో సోదాలు చేస్తే లెక్కకు మించిన ఫారిన్ మందు బాటిల్స్, దేశీయ మందు బాటిల్ దొరుకుతాయని పేర్కొన్నారు. మరి మంత్రుల ఇండ్లపై ఎక్సైజ్ సోదాలు చేస్తుందా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పోలీసులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉన్నదని, శాంతిభద్రతలు ఎక్కడ ఉన్నాయని అని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ స్పందించాలని కోరారు. పొంగలేటి శ్రీనివాస్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి ఏమైనా హోం శాఖ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారా అని అడిగారు. దీపావళిలోపే బాంబు పేల్చుతామని అన్నారని, ఆయన ఇంట్లోనే బాంబు పేలిందని, ఈడీ దాడులు విచారణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, పెండ్యాల మహేశ్ కుమార్, కెసారం తిరుపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.