కాంగ్రెస్ పాలనలో ఆటోడ్రైవర్ల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఏడాది కిందటి వరకు ఆటోలు నడుపుకొని నిరందీగా కుటుంబాలను పోషించుకున్నా.. ఇప్పుడు బతుకు భారమైపోయింది. గిరాకీలు లేక నిరుపేద, నిరుద్యోగులకు ఉపాధి దెబ్బతిన్నది. దీంతో ఆకలి కేకలు, ఆర్తనాదాలు వినిపిస్తుండగా, కుటుంబాలను పోషించుకోలేని దుస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు మనోవేదనకు గురై గుండెపోట్లతో చనిపోతుండడం కలచివేస్తున్నది. కాంగ్రెస్ సర్కారు తమను ఆదుకుంటామని హామీ ఇచ్చి మరిచిపోయిందని, తమ బతుకులు ఆగమైనా పట్టించుకోవడం లేదని ఆటోడ్రైవర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలను బంద్ చేపట్టడంతోపాటు ముఖ్యపట్టణాల్లో ర్యాలీలు తీసి కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు.
కరీంనగర్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఏడాది కిందటి వరకు ఆటోవాలాల పరిస్థితి బాగానే ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగమైంది. మహాలక్ష్మీ పథకంతో బతుకు దుర్భరంగా మారింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటోలు నడిపించుకొని జీవించే ప్రతి ఒక్కరిపైనా తీవ్ర ప్రభావం పడింది. ఒక్కసారిగా ఆకలి కేకలు మొదలుకాగా, అప్పులు చేసి ఆటోలు కొనుక్కున్న ఎందరో నిరుద్యోగులు కిస్తీలు చెల్లించలేని, అప్పులు కట్టలేని దయనీయ స్థితికి వచ్చారు. ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితుల్లో ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకుల ప్రతినిధులు ఆటోలు లాక్కెళ్లగా, ఎందరో ఆటోడ్రైవర్లు మనస్తాపం చెందారు. ఆత్మహత్యల బాట పట్టి కుటుంబాలను ఒంటరి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది ఆత్మహత్యలు, హఠాన్మరణాలకు గురయ్యారు. అందులో ఒక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే వీరి సంఖ్య 13 వరకు ఉందంటే కాంగ్రెస్ తెచ్చిన మహాలక్ష్మి పథకం ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు ఆటోవాలాలు బస్సు వెళ్లని గ్రామాలకు సైతం వెళ్లేవారు. మూరుమూల రూట్లలోనూ ప్రయాణికులను గమ్యం చేర్చేవారు. అప్పట్లో గిరాకీ బాగుండడం, ఉపాధికి డోకా లేకపోవడంతో ఎందరో నిరుద్యోగులు ఆటోలు సమకూర్చుకొని జీవనం సాగించారు. ఏడాది కిందటి వరకు పరిస్థితి బాగానే ఉన్నా.. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మహాలక్ష్మీ పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఏడాదిలో అంతా తారుమారైంది. ఆ తర్వాత ఆటోలు ఎక్కేవారే కరువయ్యారు. దాంతో వీటినే నమ్ముకొని బతుకుతున్న డ్రైవర్లు ఆగమయ్యారు. ఒకప్పుడు ఆటోల్లో ఎక్కువగా వెళ్లిన మహిళలు, ఇప్పుడు బస్సుల్లో వెళ్తుండడంతో ఆటోల గిరాకీ దెబ్బతిన్నది. దాంతో కార్మికులకు ఉపాధి కరువైంది. ఏ రూట్లో వెళ్లినా మహిళలు బస్సుల కోసం వేచి చూస్తున్నారే తప్ప తమ ఆటోల్లో ప్రయాణించడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఒకప్పుడు రోజుకు రూ.వెయ్యి పదిహేను వందలు సంపాదించినా.. ఇప్పుడు మూడు నాలుగు వందలు కూడా గిట్టుబాటు కావడం లేదని ఆందోళన చెందుతున్నారు.
గిరాకీ దెబ్బతినడంతో ఆటోవాలాలు ఆగమవుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొన్నవాళ్లు కిస్తీలు, ఈఎంఐలు చెల్లించలేక పోతున్నారు. నాలుగైదు ఈఎంఐలు పెండింగ్ ఉన్న ఆటోలను ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు లాక్కెళ్తుండడంతో ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రభావం కుటుంబాలపైనా పడుతున్నది. ఆర్థిక ఇబ్బందులు మొదలై అప్పులు చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఫీజులు చెల్లించలేక అనేక కుటుంబాల్లో పిల్లల చదువులు ఆగిపోగా, పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించుకునే వాళ్లు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. అనేక కుటుంబాల్లో ఏ పూటకు ఆ పూట కొనుక్కొని తినాల్సిన పరిస్థితులు వచ్చాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అప్పులు చెల్లించలేక, చేతిలో మరో పని లేక అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మనోవేదనతో గుండెపోటుకు గురవుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలో 13 మందికిపైగా ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొందరు గుండెపోటుతో చనిపోయారు. కరీంనగర్ జిల్లా చామన్‌పల్లికి చెందిన బండపల్లి భూమయ్య (45), ఇదే మండలంలోని దుర్శేడ్‌కు చెందిన పూదరి రమేశ్ గౌడ్ (40), రామడుగు మండలం షానగర్‌కు చెందిన జంగిలి శ్రీనివాస్ (38), వీణవంక మండలం చల్లూరుకు చెందిన ఎదులాపురం వెంకటేశ్వర్లు (43), సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్‌కు చెందిన గూడెపు సతీశ్ (37) గుండె పోటు కు గురై అర్ధాంతరంగా తనువులు చాలించారు. కరీంనగర్లో జీవిస్తున్న సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లికి చెందిన బుర్ర కరుణాకర్, కొడిమ్యాల మండలంలో బత్తిని మదన్, రామగుండంలోని భీమయ్యనగర్కు చెందిన అంజి (29) (రైల్వేట్రాక్‌పై పడి), కోనరావుపేట మండలం ధర్మారానికి చెందిన సామనపల్లి స్వామి (38), చొప్పదండికి చెందిన గోపాల అనిల్ (30), ముత్తారం మండలానికి చెందిన తగరపు వినోద్ (30), గొల్లపల్లి మండలం ఎన్గుమట్లకు చెందిన పొన్నం వెంకటేశ్ (28), మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన మారగాని రాజు (35) ఆత్మహత్య చేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ భద్రత, సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆటోడ్రైవర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తమకు ఏడాదికి 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయిందని మండిపడుతున్నారు. గతంలో అనేక సార్లు తాము ఆందోళన చేసినా ప్రభుత్వం లెక్కచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని అన్ని ముఖ్య పట్టణాల్లో ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అనుబంధ బీఆర్టీయూ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ, టీఏడీఎస్, ఆటో ఓనర్స్ అసోసియేషన్, తదితర సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు.
రవాణా శాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్ల సమస్యలపై స్పందించాలి. తక్షణమే ఆటో డ్రైవర్ల యూనియన్లతో చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. గతంలో ఎంతో సంతోషంగా ఉన్న ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఇప్పుడు ఆగమైనయి. దీనంతటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మహాలక్ష్మీ పథకాన్ని సంపన్నులు కూడా వినియోగించుకుంటున్నరు. కానీ, తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళలకే ఈ సదుపాయం ఇవ్వాలి. ఆటోడ్రైవర్లకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి భద్రత కల్పించాలి. ఆటో ఇన్స్యూరెన్స్ కట్టాలంటే 10 వేలు అవుతున్నయి. తినడానికి తిండే లేని ఆటోకార్మికులు ఇంత పెద్ద మొత్తం ఎలా కడుతరు? ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి. తక్షణమే వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటోడ్రైవర్లు అడుక్కుతినే దుస్థితి వచ్చింది. మార్పు తెస్తాం ఓట్లు వేయాలంటే ఎగబడి వేసినం. మా ఆటోడ్రైవర్ల ఉసురు పోసుకోవడమేనా మార్పు అంటే. రాష్ట్రంల 62 మంది ఆత్మహత్యలు చేసుకున్నరు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలె. మహాలక్ష్మీ పథకం ప్రభుత్వోద్యోగులు, సంపన్న మహిళలకే ఉపయోగపడుతున్నది. పేద, మధ్య తరగతి వాళ్లు ఎప్పుడో ఒకసారి బస్సుల్లో ప్రయాణం చేస్తున్నరు. ఈ పథకం మీద పునఃసమీక్ష చేయాలి.
ఒకప్పుడు ఆటోలు సరిపోయేటివి కాదు. చానామంది ఆటోలనే వెళ్లెటోళ్లు. బస్సు కన్నా రూపాయి రెండ్రుపాయలు తక్కువ తీసుకునెటోళ్లం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక మా బతుకులు ఆగమైనయి. ఫ్రీ బస్సు పథకం ఎప్పుడైతే వచ్చిందో అప్పటిసంది మా ఆటోల మొఖం కూడా చూస్త లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఆధారం లేకుండ జేసింది. ఫ్రీ బస్సు పెట్టినా మాకు ఏదన్నా ఆధారం చూపాలె. ఏడాదికి 12 వేలు ఇస్తమని చెప్పిన్రు. ఏడాది దగ్గరపడనే వట్టే. ఒక్కసారన్న మాట్లాడిన్రా? అందుకే ఆందోళన చేస్తున్నం.
రేవంత్‌రెడ్డి సీఎం అయినంక మా బతుకులు రోడ్ల మీద పడ్డయ్. మమ్ములను చెత్త బుట్టలకన్నా హీనంగ చూస్తున్నరు. ఆటోలు మంచిగ నడుస్తున్నయికదాని నేను ఫైనాన్స్‌ల కొనుక్కున్న. నెలకు 9 వేలు కట్టాలె. ఇప్పటికీ ఐదు నెల్లయితంది ఈఎంఐ కట్టక. రేపో మాపో ఆటో లాక్కపోతరు. నేను బజార్ల పడక తప్పది. ఇంత పురుగుల మందు తెచ్చుకుని తాగి చస్తం. ఇంతకన్న మాకు ఇంకేమున్నది? ఈ వయసుల ఇంకో పని చేసుకునే పరిస్థితి లేదు. మాకు న్యాయం చేయకుంటే ఆందోళన చేయకతప్పదు. మా బతుకులు మారాలంటే ప్రభుత్వం చేతులనే ఉన్నది.
ఏడాది కింద రోజుకు వెయ్యి పదిహేను వందలు సంపాయించుకునెటోళ్లం. ఇప్పుడు మూడు వందలు కూడా వస్తలేవు. ఫ్రీ బస్సు వచ్చి మా బతుకులను ఆగం చేసింది. పథకం పెట్టి నప్పు డు మా గురించి ఆలోచించితే బాగుండేది. మే మిప్పుడు రోడ్డు మీద పడితే ప్రభుత్వానికి తల వంపు కాదా? మా పరిస్థితిని ఎందుకు అర్థం చేసుకుంట లేరు. మా పిల్లలను సాదుకునుడు కష్టమైతంది. ఇంకొన్ని రోజులు ఇట్ల నే ఉంటే సిరిసిల్లల చేనేత కార్మికుల లెక్క మేము కూడా ఆత్మహత్యలు చేసుకొని సచ్చుడే అయితది.