ఆటో కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు మా పొట్ట కొట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ ఈ పథకంతో తాము ఉపాధి కోల్పోయామని, కుటుంబాలు గడువడమే కష్టంగా మారిందన్నారు. ఆటో, జీపు, టాటా మ్యాజిక్ కార్మికులను ప్రభుత్వం ఆదుకొని ఉపాధి మార్గాలు చూపించాలని కోరారు. ప్రతి నెలా జీవన భృతి కింద రూ.20వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సారంగాపూర్/ రాయికల్/ కొడిమ్యాల/ వేములవాడరూరల్, డిసెంబర్ 16 సారంగాపూర్/ రాయికల్/ కొడిమ్యాల/ వేములవాడరూరల్, డిసెంబర్ 16 : ఆటో కార్మికులు తమకు జీవనోపాధి చూపాలని శనివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఆటో యూనియన్ అధ్యక్షుడు బత్తుల దేవరాజు, నాయకుల సలీం, కమలాకర్, పాషా, 100 మంది ఆటో కార్మికులు ధర్నా చేశారు.
అనంతరం ర్యాలీగా వెళ్లి వేములవాడ ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. రాయికల్ పట్టణంలో జగిత్యాల డీజిల్ ఆటో సంక్షేమ సంఘం అధ్యక్షుడు శెట్టి శ్రీనివాస్, ఆటో డీజిల్ సంఘం జగిత్యాల జనరల్ సెక్రెటరీ ఆర్ముల్ల శ్రీనివాస్, రాయికల్ మండలాధ్యక్షుడు సామల్ల ప్రసాద్, యూనియన్ నాయకులు, రాయికల్ ఆటో, జీపు, టాటా మ్యాజిక్ డ్రైవర్లు ఆందోళన చేశారు. కాగా, వీరికి సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. బీర్పూర్ మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహ ఆటో, జీప్, టాక్స్ యూనియన్ ప్రెసిడెంట్ తిరుమల రాజేందర్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ఆటో, టాక్సీ, జీపు డ్రైవర్లు ధర్నా చేశారు.
కొడిమ్యాలలో ఆటో యూనియన్ మండలాధ్యక్షుడు పర్లపెల్లి జలేందర్ అధ్వర్యంలో నాయకులు నిరసన, ర్యాలీ తీశారు. మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి అంగడి బజార్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం దాకా ఆటోలతో ర్యాలీ తీశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు.