కరీంనగర్ తెలంగాణచౌక్, మే 2: ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆటోసంఘాల నాన్పోలిటికర్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మంద రవికుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ఆటో డ్రైవర్ల ఆకలి కేక భారీ బహిరంగ సభకు ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గత నెల 25న మెదక్‌లో చేపట్టి ఆటో రథయాత్ర శుక్రవారం కరీంనగర్ చేరుకున్నది. ఈ సందర్భంగా ఆటో సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల రాజేందర్ ఆధ్వర్యంలో నాయకులు రథయాత్రకు కోర్టు చౌరస్తాలో స్వాగతం పలికారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా తెలంగాణ చౌక్‌కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా మంద రవి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకంతో ఆటోలకు గిరాకీ తగ్గిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని.. కానీ ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలన్నారు. కిరాయిలు దొరకక కిస్తీటు కట్టలేక జీవితం భారంగా మారి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 85మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన చెందారు.
కనీసం మృతుల కుంటుంబాలను పరామర్శించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కార్పొరేషన్, ప్రతి ఆటో డ్రైవర్‌కు జీవనభృతి, ఇన్సూరెన్స్‌పై సబ్సిడీ, 5లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు సంపత్, గోపాల్‌రెడ్డి, సాగర్, శ్రీనివాస్‌గౌడ్, అనిల్, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.