తిమ్మాపూర్, అక్టోబర్ 29: ‘గురుకులాల్లో సకల వసతులను మేమిస్తాం.. మీరు ర్యాంకులు మాకు ఇవ్వండి’.. అని మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడాపోటీల ముగింపు కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరుగగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను సక్రమంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలంటే నామోషి అనే పదమే లేకుండా చేయాలన్నారు. నేడు ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారు గురుకులాల్లో చదివినవారేనని గుర్తు చేశారు. అన్ని గురుకులాల్లో సోలార్ వాటర్ హీటర్లు, ఆర్వో వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల నైట్ డ్రెస్సులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని వసతులు మేమిస్తాం.. ఉన్నత ర్యాంకులు మీరివ్వండని విద్యార్థులను కోరారు. క్రీడాపోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్యేలు డా. కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, ఎంజేపీ సొసైటీ జాయింట్ సెక్రటరీ తిరుపతయ్య, ఆర్సీవో అంజలి, ఎల్ఎండీ ప్రిన్సిపాల్ సరిత తదితరులు పాల్గొన్నారు.
క్రీడా ముగింపు కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అదే పాఠశాల ఆవరణలో ఉన్న బీఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ విద్యార్థినులు అడ్డుకుని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కళాశాలలో ఎలాంటి వసతులు లేవని, ఫీల్డ్ సరిగా లేదన్నారు. పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
చిగురుమామిడి, అక్టోబర్ 29: విద్యార్థులు బాగా చదవాలని, ప్రయోజకులు కావాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. మంగళవారం మానకొండూర్ వెళ్తూ మార్గమధ్యంలో చిన్న ముల్కనూర్‌లో ఆగిన ఆయన, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో గేమ్స్ జరుగుతున్నాయా.. ఉపాధ్యాయులు విద్యను బాగా బోధిస్తున్నారా.. తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని సూచించారు.