హుజూరాబాద్ రూరల్, మే7: బీజేపీ బరితెగించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలు, వాహనాలపై దాడులకు దిగుతున్నది. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేసింది. అక్కడి నుంచి పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు భద్రత కల్పించి హుజూరాబాద్ సమీపంలోని కేసీ క్యాంపులో ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకురాగా, ఇక్కడా దాడికి యత్నించింది. ముందస్తుగా ఏసీపీ మాధవి అధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ భారీకేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు కల్పించినా, క్యాంపు కార్యాలయంలో కౌశిక్‌రెడ్డి ఉన్నాడన్న విషయం తెలసుకున్న బీజేపీ నాయకులు కర్రలతో ఉన్న పార్టీ జెండాలతో ఎమ్మెల్యే కార్యాలయంపై దాడికి చేసేందుకు ప్రయత్నం చేశారు.
అప్పటికే కౌశిక్‌రెడ్డిని కలవడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు బయటికి వచ్చి ప్రతిఘటించారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. సహనం కోల్పోయిన పోలీసులు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకోని పోలీసు వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలోకి తీసుకుపోయి గేట్లు వేసి నిర్బంధించారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీ మాధవి పోలీసు బలగాలతో ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాంపు కార్యాలయంలోకి ఎవరూ వెళ్లకుండా, లోపల ఉన్నవారు బయటికిరాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ నుంచి భీమదేవరపల్లికి వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేశారు.