Vemulawada | వేములవాడ రూరల్ : విడాకులైన భార్య అక్క తిట్టిందని వాటర్ ట్యాంకు ఎక్కి మూడు గంటల పాటు అధికారులకు ముచ్చెమటలు పట్టించిన వ్యవహారం వేములవాడ పురపాలక సంఘం పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. శత్రాజ్ పల్లి కి చెందిన గుడిసె అశోక్ కు నాలుగు వివాహాలు అయ్యాయి. కాగా ముగ్గురికి విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం నాలుగో భార్య కూడా మనస్పర్థలతో దూరంగా ఉంటోంది.
అశోక్ తల్లిదండ్రులతో ఉంటున్నప్పటికీ మూడో భార్య అక్క తనను తిట్టిందని, ఆమె స్వయంగా వచ్చి తనకు క్షమాపణ చెప్పాలంటూ ఉదయం మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగాడు. దీంతో విషయం తెలుసుకున్న వెంటనే వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని సముదాయించే ప్రయత్నం చేశాడు. కాగా సుమారు మూడు గంటల తర్వాత తిట్టిన మూడో భార్య అక్కను పిలిపించి క్షమాపణ చెప్పిస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగాడు. అయితే మూడో భార్య అక్క తిట్టిందని మూడు గంటల పాటు అధికారులకు మాత్రం సదరు వ్యక్తి ముచ్చెమటలు పట్టించాడు.