ASHA Workers | చిగురుమామిడి, ఆగస్టు 16 : చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా వర్కర్స్ యూనియన్ ఎన్నికలు మండల కేంద్రంలో శనివారం నిర్వహించారు. యూనియన్ అధ్యక్షురాలిగా నాగేల్లి పద్మ, ప్రధాన కార్యదర్శిగా బోయిని ప్రియాంక, కోశాధికారిగా అంజలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభ ఆగస్టు 28న కరీంనగర్లో జరుగుతుందన్నారు.
ఆశా వర్కర్ల సమస్యల కోసం సీఐటీయూ నిరంతరం పోరాటాలు చేసిన చరిత్ర ఉందని, వారికి అండగా ఉంటామన్నారు. కనీస కార్మికులుగా గుర్తించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. వీరికి ఈఎస్ఐ, పిఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలే తప్ప మరో మార్గం లేదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ బండారి సరోజన, లక్ష్మీ, సుజాత, కల్పన,సునీత తో పాటు మండలంలోని ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.