ప్రజా సేవే పరమావధిగా పనిచేసే ఆశ కార్యకర్తలు సర్కారు తీరుపై కదంతొక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం రోడ్డెక్కారు. గురువారం వందలాదిగా తరలివచ్చి ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. ప్రతిభాపాటవాలు పరీక్షించేందుకు, అలాగే కొత్తగా వచ్చే వారికి ప్రవేశ పెట్టిన పరీక్షలను రద్దు చేయాలంటూ నినదించారు. ఎక్కడా లేని విధంగా పారితోషికం లేకుండా కరీంనగర్లో చేపట్టిన బీసీజీ సర్వే రద్దు చేయాలని స్పష్టం చేశారు. కనీస వేతనం 18వేలు ఇవ్వాలని, అలాగే తమ 24 డిమాండ్లు నెరవేర్చాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కరీంనగర్ కలెక్టరేట్/ సిరిసిల్ల కలెక్టరేట్/ జగిత్యాల, జూన్ 13: కాంగ్రెస్ సర్కారుపై ఆశకార్యకర్తలు మండిపడుతున్నారు. తమ ప్రతిభాపాటవాలు పరీక్షిం చేందుకు పరీక్ష నిర్వహించాలనే రాష్ట్ర సర్కారు నిర్ణయంపై భగ్గుమంటున్నారు. గురువారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలిపారు. కరీంనగర్లో తెలంగాణ ఆశ కార్యకర్తల యూనియన్ గౌరవాధ్యక్షుడు ఎడ్ల రమేశ్, సంఘం జిల్లా అధ్యక్షురాలు రంగవేని శారద, ప్రధానకార్యదర్శి మారెళ్ల శ్రీలత ఆధ్వర్యంలో 150 మంది, జగిత్యాలలో సీఐటీయూ జగిత్యాల జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన, ఆశ యూనియన్ అధ్యక్షురాలు ఆత్మకూరి లత, కార్యదర్శి మమత, రాజన్న సిరిసిల్లలో సీఐటీయూ రాజన్నసిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి కోడం రమణ, జిల్లా నాయకులు ఎలిగేటి రాజశేఖర్, అన్నల్దాస్ గణేశ్, గురజాల శ్రీధర్, ఆశ కార్యకర్తల యూనియన్ జిల్లా కార్యదర్శి జయశీల, అధ్యక్షురాలు భారతి తదితరులతో కలిసి ఆశకార్యకర్తలు ఆందోళన చేశారు.
ఆశ కార్యకర్తలకు పరీక్ష నిర్వహించాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఆశ కార్యకర్తల యూనియన్ గౌరవాధ్యక్షుడు ఎడ్ల రమేశ్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సత్వరమే అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా అందజేస్తున్న పారితోషికం పెంచడంతోపాటు కనీసం వేతనం 18వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్యకర్తకు 50లక్షల బీమా వర్తింప చేయాలని, మట్టి ఖర్చుల కింద 50వేలు చెల్లించాలని, విరమణ ప్రయోజనం కింద 5లక్షలు చెల్లించడమే కాదు ఇస్తున్న పారితోషకంలో సగం పెన్షన్ రూపేణా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతం లో పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ ఏరియర్స్, లెప్రసీ సర్వే డబ్బులు కూడా సత్వరమే చెల్లించాలన్నారు.
పోటీ పరీక్షలతో పాటు సాధారణ పరీక్షల్లో కూడా విధులు నిర్వహిస్తున్నందున డబ్బులు విడుదల చేయాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రసూతి సెలవులు కల్పిస్తూ, సర్క్యులర్ విడుదల చేయాలన్నారు. ప్రతి ఏటా 20 రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు కల్పించాలని, ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్ అవకాశం కూడా కల్పించాలని కోరారు. సకాలంలో యూనిఫామ్స్ అందజేయాలని, పారితోషికం లేని పనులు, ఏఎన్ఎంల పనులు తమకు అప్పగించవద్దని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కరీంనగర్ జిల్లాలో మాత్రమే క్షయవ్యాధి నియంత్రణ కోసం బీసీజీ సర్వే పేరిట కొత్త సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. సుమారు రెండు దశాబ్దాలుగా గ్రామా లు, బస్తీల్లో బీపీ, షుగర్, థైరాయిడ్, మాతాశిశు సంరక్షణ చర్యలను చేపడుతున్నారని, తాజాగా మరిన్ని వ్యా ధులు చేర్చడం దారుణమని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్‌ను కలిసేందుకు సంఘ నాయకురాళ్లు వెళ్లారు. జిల్లా అధ్యక్షురాలు రంగవేని శారద, ప్రధానకార్యదర్శి మారెళ్ల శ్రీలత పాల్గొన్నారు.
ఆరోగ్య సిబ్బందికి దీటుగా మేం గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నం. కరోనా కష్టకాలంలో తమ సేవలను గుర్తించిన నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ గ్లోబల్ లీడర్లుగా తమను అభివర్ణించింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక కరివేపాకులా తీసేస్తుంది. ప్రతిభా పాటవ పరీక్షలు, కొత్తగా చేరేవారికి ప్రవేశపరీక్షలంటూ నూతన సంస్కరణలకు ఆజ్యం పోస్తున్నది. వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకుంటే ఆందోళనలు తప్పవు.
– మారెలి ్ల శ్రీలత, తెలంగాణ అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి