హక్కుల కోసం పోరుబాట పట్టిన ఆశ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. వారం పది రోజులుగా నిరసనలు తెలుపుతున్న వారిని అరెస్ట్‌లతో అణచివేస్తున్నది. తాజాగా హైదరాబాద్ ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి వెళ్తుండగా, ఎక్కడికక్కడ నిర్బంధించింది. మహిళలని కూడా చూడకుండా రాత్రి పూట పోలీస్ స్టేషన్లకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తమను వెట్టి చాకిరి నుంచి విముక్తులను చేసి, ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసినందుకే ప్రభుత్వం ఈ రకంగా కట్టడి చేస్తున్నదని
ఆశ కార్యకర్తలు వాపోతున్నారు. తమను ఎంత అణచివేస్తే అంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో తమకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని, అప్పటి వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : ఆరోగ్య సమాజం కోసం కృషి చేస్తున్న ఆశ కార్యకర్తలకు తగిన వేతనం ఇచ్చి గౌరవించాల్సిన ప్రభుత్వం అణచివేతకు గురి చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా హక్కుల గురించి అడిగితే ఉక్కుపాదం మోపుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెలవులు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నా కనీస వేతనం రాకపోగా.. ఇచ్చే వేతనం నుంచే కటింగ్ చేస్తున్నారని ఆశ కార్యకర్తలు వాపోతున్నారు.
తమకు అప్పగించిన విధులే కాకుండా ప్రభుత్వ పరమైన ఇతర సర్వేలు, వెట్టి పనులు కూడా చేయిస్తున్నారని, రావాల్సిన పెండింగ్ పారితోషకాలు కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తుతున్నారు. 2023 సెప్టెంబర్‌లో తాము పదిహేను రోజుల పాటు చేసిన దీక్షా శిబిరాల వద్దకు కాంగ్రెస్ నాయకులు వచ్చి అనేక హామీలు ఇచ్చారని, నెలకు 18 వేల వేతనం ఇస్తామని, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పిస్తామని ఎన్నికల హామీల్లో పెట్టారని గుర్తు చేశారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని మండిపడుతున్నారు.
ఎక్కడికక్కడ నిర్బంధం
ఆశ కార్యకర్తలు ఈ నెల 17 నుంచి వరుస ఆందోళనలు చేస్తున్నారు. మొదట తహసీల్ ఆఫీసుల ఎదుట ధర్నా చేసి వినతి పత్రాలు ఇచ్చారు. తర్వాత ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల ఎదుట నిరసనలు తెలిపారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయం, కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేశారు. ఆయా సందర్భాల్లో పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. తాజాగా ‘చలో ఆరోగ్యశాఖ కమిషనరేట్’ పేరిట చేపట్టిన కార్యక్రమాన్ని సైతం పోలీసులు అణచివేసే ప్రయత్నం చేశారు.
ఆదివారం రాత్రి నుంచే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశ కార్యకర్తలను అరెస్టులు ప్రారంభించారు. మహిళలని కూడా చూడకుండా రాత్రి సమయంలో స్టేషన్లకు తీసుకెళ్లడం, గంటల తరబడి నిర్బంధించారు. సోమవారం కూడా నిఘా పెంచి ఆశ కార్యకర్తలు జిల్లా సరిహద్దులు దాటకుండా చర్యలు తీసుకున్నారు. బస్సుల్లో తనిఖీలు చేసి మరీ స్టేషన్లకు తరలించారు. ముఖ్యంగా తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి, బస్సులు, ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్ వెళ్తున్న వారిని అడ్డుకున్నారు.
అక్కడి నుంచి తిమ్మాపూర్ పోలీసు స్టేషన్‌తోపాటు కరీంనగర్‌లోని పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించి పొద్దంతా నిర్బంధించారు. కమిషనరేట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే, రాత్రి వేళ అరెస్టులు చేసిన వారిని సొంత పూచీ కత్తుపై వదిలేసి సోమవారం ఉదయమే తిరిగి స్టేషన్‌కు రావాలనే షరతులతో వదిలేశారు. సోమవారం ఉదయం కొందరు పోలీస్ స్టేషన్‌కు స్వచ్ఛందంగా వెళ్లారు.
వెళ్లని వారిని ఇంటికెళ్లి మరీ స్టేషన్లకు తరలించారు. జగిత్యాల జిల్లాలోనూ ఆదివారం అర్ధరాత్రి ముందస్తు అరెస్ట్ చేసి, సోమవారం మధ్యాహ్నం వదిలిపెట్టారు. స్టేషన్లలో నిర్బంధించిన మహిళలు ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఆశ కార్యకర్తలు మాత్రం నిఘా నుంచి తప్పించుకుని హైదరాబాద్ వెళ్లారు. అయితే, అక్కడి కమిషనరేట్ ముట్టడి సందర్భంగా లాఠీచార్జి జరిగినట్టు ఆశ కార్యకర్తల యూనియన్ నాయకులు చెబుతున్నారు.
మాపై దౌర్జన్యమా..?
మాకు నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదు. పోలీసులు ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నరు. మేము అడిగేది న్యాయమైన డిమాండ్లే. మాకు ఇస్తున్న పారితోషికం ఏ మాత్రం సరిపోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇస్తున్న పారితోషికం నుంచి కటింగ్‌లు చేస్తున్నరు. ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని గతంలో మేము చేసిన రిలే నిరాహార దీక్షల వద్దకు కాంగ్రెస్ నాయకులు వచ్చి హామీ ఇచ్చిన్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పక పరిష్కరిస్తామని చెప్పిన్రు.
మా సమస్యలపై ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టిన్రు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. అందుకే తిరిగి మరోసారి వరుస ఆందోళనలు చేస్తున్నం. కానీ పోలీసులు మమ్మల్ని తీవ్రంగా అడ్డుకుంటున్నరు. కలెక్టరేట్ ముందు ధర్నాకు వెళ్లినపుడు కూడా ఇదే అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించిన్రు. ఈ రోజు కూడా అదే విధంగా అరెస్టులు చేసిన్రు. రోడ్లపై నిఘా పెట్టి మరీ ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించిన్రు. ఇది ఎంత వరకు న్యాయం? మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి మాపై ఇలా దౌర్జన్యం చేయడం ఎంత వరకు సమంజసం?
– మారెళ్ల శ్రీలత, ఆశా కార్యకర్తల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి (కరీంనగర్)
ఉద్యమాలను ఉధృతం చేస్తం
ఆశ కార్యకర్తలు ఏండ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్నరు. గతంలో న్యాయం చేయాలని పోరాడినప్పుడు 18 వేలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చిన్రు. ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లంతా మరో విధంగా ప్రవర్తిస్తున్నరు. మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రి వరకు పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం ఎంత వరకు కరెక్ట్? ఆశ కార్యకర్తల ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు లాక్కోవడం సరికాదు. సోమవారం తెల్లవారు జాము నుంచే గ్రామాల్లోని ఆశల ఇండ్లలోకి వెళ్లి పోలీసు స్టేషన్లకు తరలించిన్రు. ఇదెక్కడి న్యాయం? మహిళలని కూడా చూడకుండా ఇష్టమైన రీతిలో అరెస్టులు చేస్తున్నరు. ఇలాగే నిర్బంధం సాగిస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తం. ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తం.
– ఎడ్ల రమేశ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి(కరీంనగర్)
ఆశ కార్యకర్తల డిమాండ్లివే
18 వేల ఫిక్స్డ్ వేతనం చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి
ఈఎస్ఐ, ఈపీఎఫ్ సదుపాయం కల్పించాలి
రిటైర్డ్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలి
ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లెప్రసీ సర్వే బిల్లులు చెల్లించాలి
సేవల్లో ఉండి మరణించిన వారికి 50 వేలు (మట్టి ఖర్చులు) అంతిమ సంస్కారాలకు చెల్లించాలి
50 లక్షలు బీమా సదుపాయం కల్పించాలి
ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసిన ఆశలకు ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలి
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి