వేములవాడ, డిసెంబర్ 1: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా అనుబంధ భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలను కల్పించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కోసం 3.44కోట్లు వెచ్చించారు. అయితే తాగునీటి వసతిని మాత్రం మరిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కోడెల, ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా భీమేశ్వర ఆలయానికి చేరుకుంటున్న చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. కేవలం రద్దీగా సమయాల్లో మాత్రమే తాగునీటిని అందిస్తుండగా, మిగతా రోజుల్లో పట్టించుకోకపోవడంతో గోసపడుతున్నారు.
శుద్ధ జలయంత్రాలున్నా నిర్లక్ష్యం
రాజన్న ఆలయానికి దివిస్ ల్యాబ్ యాజమాన్యం గతంలో రెండు శుద్ధ జల యంత్రాలను అందించింది. అలాగే ఆలయం అధికారులు మరో రెండింటినీ ఏర్పాటు చేయగా, భక్తుల దాహం తీరింది. ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ఈ నాలుగింటిని భీమేశ్వర సదన్ పారింగ్ స్థలానికి తరలించి వదిలేశారు. దాదాపు నెల రోజులు కావస్తున్నా ఈ యంత్రాలను అందుబాటులోకి తేవడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండడంతో తాగునీటికి తండ్లాడాల్సిన దుస్థితి దాపురించింది.
గుక్కెడు నీళ్లు లేవు
భీమేశ్వర ఆలయంలో తాగునీటికి ఇబ్బంది ఉంది. గుక్కెడు నీళ్లు కూడా దొరికే పరిస్థితి లేదు. నీళ్లు తాగాలంటే బయటికి వచ్చాక షాప్‌లో బాటిల్ కొనుక్కోవాల్సిందే. ఆలయ పరిసరాల్లో తాగునీటికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి.
-నాను, ములుగు జిల్లా
ఏర్పాట్లు చేస్తున్నాం
రాజన్న ఆలయానికి చెందిన నాలుగు శుద్ధజల యంత్రాలను భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసి తాగునీటి వసతి కల్పిస్తాం. ఒకటి జనరేటర్ వద్ద, మరొకటి నటరాజ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించాం. మూడోది భీమేశ్వర అతిథి గృహం పైన ఏర్పాటు చేసి ఆలయంలోని భక్తులకు నేరుగా పైప్‌లైన్ ద్వారా నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నాలుగోది పార్వతీపురం భవనంలో ఏర్పాటు చేసి కట్ట పైన ఉన్న కోడెల క్యూ కాంప్లెక్స్‌లో తాగునీటి సౌకర్యం కల్పిస్తాం.
– రాజేశ్ ఈఈ, రాజన్న ఆలయం, వేములవాడ