Ramagundam Baldia | కోల్ సిటీ, మార్చి 20 : అంతా అయిపోయింది. అనుకున్నదొక్కటి.. అయ్యిందొకటి జరిగింది. కో-ఆప్షన్ పదవులపై రామగుండంలో గందరగోళం నెలకొంది. 2019 మున్సిపల్ చట్టం, 2020 మార్చి 16న విడుదలైన జీవో నం.57. 58 ప్రకారంగానే కార్పొరేషన్లో ఐదుగురు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలంటూ సీడీఎంఏ టీ.కే. శ్రీదేవి (ఐఏఎస్) ఉత్తర్వులు జారీ చేయడంతో ఇన్నాళ్ల సందిగ్ధతకు తెరపడింది. ఇక రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయడమే ఆలస్యం కో-ఆప్షన్ పదవుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈసారి కార్పొరేషన్లో 10 నుంచి 15 మంది కో- ఆప్షన్ల సంఖ్య పెరుగుతుందని ప్రచారం జరిగింది.
దాంతో కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది కో-ఆప్షన్ పదవులపైనే ఆశలు పెట్టుకున్నారు. నిన్నటి మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫారం ఆశించి భంగపడ్డ సుమారు 30 మంది వరకు కో-ఆప్షన్ పదవులు ఇస్తామని స్థానిక ఎమ్మెల్యే సర్దిచెప్పారు. అదే భరోసాతో ఉన్న ఆశావహుల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. అంతమందిలో ఐదుగురు ఎవరనేది ఉత్కంఠ రేపుతుండగా, ఈ ఊహించని పరిణామంతో రామగుండం కాంగ్రెస్ పార్టీలో ముసలంకు దారితీసేలా ఉంది.
ఎంపిక విధానం ఇలా..
కాగా, కార్పొరేషన్లో ఐదుగురు కో-ఆప్షన్లలో ఇద్దరు మహిళలకు చోటు ఉంటుంది. వీరిలో ఒకరు మైనార్టీ కాగా, మరొకరు జనరల్ కేటగిరి నుంచి ఎన్నికవుతారు. మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ పరిపాలనపై ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారు, వరుసగా మూడేళ్లు కార్పొరేషన్‌కు న్యాయవాదిగా సేవలందించిన వారు, రిటైర్డు మున్సిపల్ అధికారులు అర్హులు. పాలక వర్గం మొదటి కౌన్సిల్ సమావేశం జరిగాక 2 నెలల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలి. సీడీఎంఏ ఉత్తర్వుల మేరకు మరో వారంలో కార్పొరేషన్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం మేయర్, కార్పొరేటర్లు ఓటు ద్వారా కో-ఆప్షన్లను ఎన్నుకుంటారు. కార్పొరేటర్లతో సమానంగా గౌరవ వేతనం పొందుతారు. ఎజెండా అంశాలపై ఓటు హక్కు ఉండదు.
ఊరించి.. ఊసురుమనిపించి..
కాగా, నిన్నటి మున్సిపల్ ఎన్నికల వేళ స్థానిక ఎమ్మెల్యే మాట మీదుగా సుమారు 30 వరకు కో-ఆప్షన్ పదవులపై ఆశతో ఉన్నారు. ఇప్పుడు అందరి అంచనాలు తారుమారయ్యాయి. పాత పద్ధతిలోనే ఐదుగురు కో-ఆప్షన్లను ఎన్నుకోవాలంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనితో రామగుండంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ముఖ్యంగా అధికార పార్టీలో ముసలంకు దారితీస్తుంది. అంతమందిలో ఆ ఐదుగురు ఎవరనేది పక్కనబెడితే మిగతా వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతోంది. ఇప్పటికే మేయర్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది కార్పొరేటర్లు నిరాశతో ఉన్నారు. మేయర్ ఎన్నిక వేళ కార్పొరేటర్లకు ఎంతోకొంత ముట్టజెప్పే ఆనవాయితీ ఉండేది. కానీ, ఇప్పటికీ ఒక్క పైసా రాలేదని బాహాటంగానే చెప్పుకుంటూ బాధపడుతున్నారు. ఈ సమస్యకు తోడు కో-ఆప్షన్ పదవుల ఎంపిక పార్టీకి పెద్ద చిక్కులే తెచ్చిపెట్టేలా ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే కో-ఆప్షన్ పదవి వస్తుందని ధీమాతో ఉన్నవారు అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. ఐతే అంతమందికి ఎమ్మెల్యే మాటిచ్చి ఉండకూడదనీ, ఇదంతా కావాలనే చేసి ఉంటారని ఆశావహులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. పర్యవసానం ఎక్కడికి దారితీస్తుందోనని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.