ముకరంపుర, మార్చి 21: అమృత్ భారత్ పథకంలో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ లో చేపడుతున్న ఆధునికీకరణ పనుల్లో వేగం పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం రైలు మార్గం ద్వారా ప్రత్యేక రైలులో నిజామాబాద్ నుంచి కరీంనగర్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న రెండవ నెంబర్ ప్లాట్ ఫారంపై దిగారు. స్టేషన్ మేనేజర్ తో పాటు ప్రాజెక్టు, ఇంజినీరింగ్, ఇతర విభాగాల అధికారులు జీఎం కు పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ లో రూ.44కోట్ల నిధులతో చేపడుతున్న ఆధునికీకరణ పనులను ఆయన పరిశీలించారు. స్టేషన్ ఆవరణలోని అన్ని ప్రాంతాలను జీఎం కలియ తిరిగారు. పనుల ప్రగతి, జరుగుతున్న తీరును పరిశీలించారు.
ఇప్పటి వరకు జరిగిన పని, ఇంకా మిగిలి ఉన్న పనుల గురించి చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సుబ్రమణ్యం జీఎం కు వివరించారు. ప్రస్తుతం 90శాతం పని పూర్తయిందని, ఇంకా మిగులు పనులను వెంటనే పూర్తి చేసి, ఏప్రిల్ 27లోగా రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధం చేసే కార్యాచరనతో ముందుకు వెళుతున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. రైల్వే పనుల పరిశీలనకు వచ్చిన జీఎంను రైల్వే హమాలీ యూనియన్ నాయకులు, హమాలీలు సన్మానించారు. రైల్వే గూడ్స్ షెడ్ ను కరీంనగర్ లొనే కొనసాగించాలని, ఒకవేళ కొత్తపల్లి రైల్వే స్టేషన్ కు తరలిస్తే ప్రస్తుతం ఉన్న కరీంనగర్ స్టేషన్ లో పనిచేస్తున్న హమాలీలకే పని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
పొత్కపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, కరోనా సమయంలో రద్దు చేసిన కాజీపేట-బళ్లార్షా రైలు 17035(అజ్ని), కరీంనగర్- తిరుపతి రైలు 12762ను పొత్కపల్లిలో నిలుపాలని పొత్క పల్లి పీఏసీఎస్ ఛైర్మెన్ ఆళ్ల సుమన్ రెడ్డి, పెద్దపల్లి సోషల్ మీడియా జిల్లా కో ఆర్డినేటర్ రెడ్డి రజనీకాంత్ గౌడ్ జీఎ కు విజ్ఞప్తి చేశారు. తీగలగుట్టపల్లెలో రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఇళ్లలోని డ్రైనేజీ, వర్షం నీటి ప్రవాహాన్ని రైల్వే డ్రైనేజీలోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసి బొల్లాడి మల్లారెడ్డి జీఎంకు విన్నవించారు.