పెద్దపల్లి, మార్చి8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాక ముందు విద్యుత్ శాఖ కార్మికులు రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో బతికారు. అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీరి సేవలను గుర్తించారు. 2019 అక్టోబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 23,667మందికి సర్కారీ నౌకరీ ఇచ్చి ఆర్టిజన్ కార్మికులుగా గౌరవం కల్పించారు.
అప్పటి నుంచి వీరు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. రెగ్యులర్ పే స్కేల్స్, పే స్లిప్స్, పెయిడ్ హాలిడేస్ తదితర బెనిఫిట్స్ పొందుతున్నారు. వాస్తవానికి ఆర్టిజన్ కార్మికులు ప్రమాదకరమైన విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రధానంగా విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, ఫ్యూజ్ ఆఫ్ కాల్ అటెండ్ చేయడం, తదితర పనులు చేస్తుంటారు. ప్రస్తుతం వీరు 15వేల నుంచి 25వేల మధ్య వేతనం పొందుతున్నారు. అయితే పలు రకాల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్టిజన్, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్‌కో, జెన్కో, ఎన్పీడీసీఎల్లో పని చేస్తున్న దాదాపు వెయ్యి మందితో సంతకాల సేకరణ చేపట్టారు. మంగళవారం హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లోని టీఎన్పీడీసీఈఎల్ కార్యాలయం ఎదుట తొమ్మిది సంఘాలతో కూడిన జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు గాను ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.
మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఉద్యమిస్తాం. ఇప్పటికే ఆర్టిజన్ కార్మికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ నెల 10న హైదరాబాద్ మింట్ కంపౌండ్ లోని టీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట తొమ్మిది సంఘాలతో కూడిన తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ అసోసియేషన్ జేఏసీ పేరుతో మహాధర్నా నిర్వహించి సమ్మె నోటీసు అందజేస్తాం.
– తూళ్ల నాగరాజు, జేఏసీ చైర్మన్ (ఉమ్మడి కరీంనగర్ జిల్లా)