కోరుట్ల, డిసెంబర్ 19: కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాకే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు విమర్శించారు. పాముకాటుకు గురై కోరుట్ల ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న పెద్దాపూర్ గురుకుల విద్యార్థులు అఖిల్, యశ్విత్‌ను ఆయన గురువారం పరామర్శించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులను పాముకాటు వేయడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం పెద్దాపూర్ గురుకులంలో పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్తుండగా విద్యాసాగర్‌రావును పోలీసులు అడ్డుకున్నారు.
మధ్యాహ్నం 2.30గంటలకు అరెస్ట్ చేసి కోరుట్ల స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం 5 గంటల తర్వాత విడుదల చేశారు. ఈ సందర్బంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేసేందుకు, గురుకులంలో వాస్తవ పరిస్థితులను నివేదించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఆర్థిక స్థోమత లేకపోతే తామే చందాలు వేసి మౌలిక వసతులు కల్పిస్తామని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో చేరేందుకు విద్యార్థులు అసక్తి చూపేవారని, ఇంజినీర్లు, డాక్టర్లను అందించిన ఘనత గురుకుల పాఠశాలకు ఉందన్నారు. ఇప్పుడు గురుకులాలు అంటేనే భయపడే రోజులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సుమారు 50 వరకు ఫుడ్‌పాయిజన్, పాముకాటుతో విద్యార్థులు మరణించిన ఘటనలు జరిగాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరవాలని, గురుకులాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు చీటి వెంకట్రావు, దారిశెట్టి రాజేశ్, బట్టు సునీల్, ఫహీం, అతిక్, సురేందర్, కృష్ణంరాజు, అస్లాం, అమేర్, తదితరులు ఉన్నారు.