చిగురుమామిడి, నవంబర్ 9 : పెండింగ్ బిల్లు లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్‌లు చలో హైదరాబాద్ తలపెట్టిన నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సోమవారం ఉద యం నుంచి మండల వ్యాప్తంగా మాజీ సర్పంచ్ లను పోలీసులు ఇండ్ల వద్దనే అరెస్టు చేసి, పోలీస్స్టేషనళ్లకు తరలించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు జకుల రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినప్పటికీ తమకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. తమ బిల్లులు అందించాలని డిమాండ్ చేస్తే అరెస్టు చేస్తారా అని వారు ప్రశ్నించారు. బిల్లులు మంజూరు చేసే వరకు తమ పోరాటం ఆపేది లేదని మాజీ సర్పంచులు స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి, ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచుల జీవితాలతో రాజకీయ చెలగాట మాడుతోందన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంకు ఎన్నిసార్లు తమ బిల్లులు చెల్లించాలని విన్నవించినా ఫలితం లేదన్నారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, గ్రామాల్లో అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ సర్పంచులు సన్నిళ్ల వెంకటేశం, నాగేల్లి వకుళ లక్ష్మీరెడ్డి, గోలి బాపురెడ్డి, శ్రీనివాస్, బెజ్జంకి లక్ష్మణ్ ఉన్నారు.
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించండి
హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 9 : రంగాపూర్ మాజీ సర్పంచ్ బింగి కరుణాకర్ మాట్లాడుతూ పెం డింగ్ బిల్లులు చెల్లించాలంటే అరెస్టులు చేయడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అరెస్ట్ అయి న వారిలో మాజీ సర్పంచులు ప్రతాపరెడ్డి, మనోహర్, లక్ష్మారెడ్డి, నిరోషా కిరణ్, తిరుపతి ఉన్నారు.
వీణవంక, డిసెంబర్ 9 : పెండింగ్ బిల్లులు చెల్లించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మాజీ సర్పంచ్‌లు బండారి ముత్తయ్య, మోరె సారయ్య, జున్నూతుల సునీతామల్లారెడ్డి, మర్రి వరలక్ష్మీస్వామి, పోతుల నర్సయ్యను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఎస్ఐ తోట తిరుపతి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
గన్నేరువరం,డిసెంబర్ 9: మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్ లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ వారిలో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి, సర్పంచులు గంప మల్లేశ్వరి వెంకన్న, పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్, శారదాశ్రీనివాస్, నగేశ్ ఉన్నారు.
తిమ్మాపూర్,డిసెంబర్9: మండలంలోని మాజీ సర్పంచులను ఎల్ఎండీ ఎస్ఐ వివేక్ అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచి రావుల రమేశ్, పలు గ్రామాల సర్పంచులు మేడి అంజయ్య, వడ్లూరి శంకర్, మామిడి సతీశ్‌ను స్టేషన్‌కు తరలించారు.
అరెస్టులను ఖండించిన సర్ఫంచుల ఫోరం
హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 9 : మాజీ సర్పంచుల అరెస్టును సర్పంచుల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి ఖండించారు. సోమవారం అరెస్టయిన మాజీ సర్పంచులను పోలీస్ స్టేషన్లో కలిసి పరామర్శించారు. మాజీ సర్పంచులను దొంగల్లా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి, రోజం తా స్టేషన్లో కూర్చోబెట్టడం బాధాకరమన్నారు.