తాజా మాజీ సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నిర్బంధించింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. ఇండ్లలో ఉన్న వారిని బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు రోజంతా స్టేషన్లలోనే నిర్బంధించారు. గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన తమకు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందిపోయి అక్రమంగా తమను అరెస్ట్ చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కనీసం నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా అక్రమంగా నిర్బంధించడం ఎంత వరకు సబబని నిలదీశారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే రేవంత్ రెడ్డికి పతనం తప్పదని స్పష్టం చేశారు.
కరీంనగర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం అసెంబ్లీ ముట్టడి వెళ్లాల్సిన మాజీ సర్పంచులను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి నుంచే అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. చలిలో స్టేషన్లలోనే నిర్బంధించారు. సాయంత్రం సొంత పూచీ కత్తుపై వదిలేశారు. కొందరు హైదరాబాద్ వెళ్తుంటే రోడ్లపై తనిఖీలు చేసి మరీ పట్టుకెళ్లారు. మరి కొందరికి ఫోన్లు చేసి స్టేషన్లకు పిలిపించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు వెళ్లరాదని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించారు. ఒక్కరు కూడా హైదరాబాద్ వెళ్లకుండా చూడాలని అన్ని పోలీసు స్టేషన్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ వెళ్లిన వారిని సైతం అక్కడే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.
కలెక్టరేట్ ఎదుట దీక్షలు
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన మాజీ సర్పంచులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించగా.. మరి కొంత మంది మాజీ సర్పంచులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరవదిక నిరసన దీక్షలకు పూనుకున్నారు. ఒక్కో సర్పంచుకు 30 లక్షల నుంచి 50 లక్షలు ఆపైన బిల్లులు రావాల్సి ఉందని, అప్పులు చేసి ఆస్తులు, బంగారం కుదువపెట్టి అభివృద్ధి పనులు చేశామని మాజీ సర్పంచులు వాపోయారు. ఆనాడు తమ బాధలు విన్న రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో బిల్లులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు చెల్లించకుండా తమ ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తమ పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే గ్రామ పంచాయతీ కార్యాలయాలకు తాళాలు వేసి కార్యకలాపాలు నిలిపి వేస్తామని హెచ్చరించారు.