paddy procurement | రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్, అక్టోబర్ 8 : వరి ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్(2025-26) ధాన్యం కొనుగోళ్ల సన్నాహక సమావేశం వివిధ శాఖల అధికారులు, ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, డీసీఎం ఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా షామియానా, తాగు నీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేశారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని కేంద్రాలకు తరలించాలని సూచించారు. అవసరమైన గన్ని బ్యాగులు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2389, కామన్ రకానికి రూ.2369 నిర్ణయించిదని వెల్లడించారు.
ధాన్యం సేకరణలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కీలకమని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా వసతులు కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించిన ధాన్యానికి టోకెన్లు జారీ చేసి, రైతుల నుంచి సేకరించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలో రైతుల భూమి సర్వే నంబర్, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు.? బ్యాంక్ ఖాతా వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి రైతుల బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు పడేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ధాన్యం తరలింపు, దించుకోవడంలో ముందస్తుగా వసతులు కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 13 మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లా లో ఈ సీజన్లో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని వెల్లడించారు. ధాన్యాన్ని సేకరించేందుకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 79, ఐకేపీ ఆధ్వర్యంలో 144, వివిధ శాఖల ఆధ్వర్యంలో 12 కేంద్రాలు, మొత్తం 231 ప్రారంభించనున్నట్లు తెలిపారు.
అందుబాటులో పరికరాలు
జిల్లాలో అవసరం మేరకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని అదనపు కలెక్టర్ వెల్లడించారు. టార్పాలిన్లు, తూకం వేసే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం చూసే మెషిన్లు డిజిటల్ కాలిపర్స్, అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. గన్ని సంచులు, ధాన్యం తరలింపు, రైస్ మిల్లుల్లో ధాన్యం దించుకోవడంలో ఇబ్బందులు తొలగించాలని కోరారు. ఈ సమీక్షలో డీసీఎస్ఓ చంద్రప్రకాష్, జిల్లా మేనేజర్ రజిత డీఏఓ అఫ్జల్ బేగం, డీఆర్డీఓ శేషాద్రి, డీసీఓ రామకృష్ణ, డీఎంఓ ప్రకాష్, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.