ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహా నాయకుడు కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన రోజే దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ‘2009 నవంబర్ 29’న ప్రారంభించిన ఈ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్పి రాష్ట్ర ఏర్పాటులో కీలకమైంది. ఆనాడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గమ్యాన్ని ముద్దాడిన చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే.. నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకొని వివిధ రంగాల్లో రాణించాలనుకునే ప్రతి యువతీ యువకుడు తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రను ఔపోసన పట్టాల్సిన అవసరమున్నది.
దశాబ్దాలపాటు బందీ అయిన తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచిన ఘనత కేసీఆర్‌ది! నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్‌ది! సమైక్య పాలకుల కుట్రలను ఛేదించి.. ప్రాణాలను పణంగా పెట్టిన ధీరత్వం కేసీఆర్‌ది! ‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప’ అంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగి, యావత్ దేశాన్ని కదిలించిన వీరత్వం కేసీఆర్‌ది! నాడు స్వాతంత్య్ర సాధనకు గాంధీజీ దేశాన్ని ఒకతాటిపైకి తెస్తే.. బానిస సంకెళ్ల నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి, రాష్ర్టాన్ని సాధించిన చతురత కేసీఆర్‌ది! ఎవరు అవునన్నా కాదన్నా.. తెలంగాణ సాధన సుదీర్ఘ మహోద్యమానికి సారథ్యం వహించింది గులాబీ అధినేత కేసీఆరే! ఆనాడు ఆయన పిలుపుతో నాలుగు కోట్ల ప్రజానీకం ఒక్కటై, పిడికిలి ఎత్తింది. ఆయన వెంటే సమరాంగణంలో దూకింది. ఫలితంగా ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. దేశమే దిగొచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించాల్సిన అనివార్యతను, అగత్యాన్ని సృష్టించింది. మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని నడిపి, గమ్యాన్ని ముద్దాడిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. దశాబ్దాల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది తప్ప పాలకుల దయాదాక్షిణ్యాలతో కాదన్నది వాస్తవం! వీటన్నింటికీ స్ఫూర్తి, బలాన్ని ఇచ్చింది.. సమస్త పోరాటాలకు వేదికైంది ఈ దీక్షా దివసే!
కరీంనగర్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 నుంచి అనేక ఉద్యమాలు చేసినా.. ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పైగా ఊరించి ఉసూరు మనిపించాయే తప్ప ఆంకాక్షను నేరేవేర్చే దిశగా అడుగులు వేయలేదు. ఆనాడు ఉద్యమనేతగా అన్నింటినీ నిశితంగా పరిశీలించిన కేసీఆర్, రాష్ట్ర సాధనకు ఒక్కడిగా కదిలారు. తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తేవడమేకాదు, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. అందులో భాగంగానే ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అన్న నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్ నుంచి సిద్దిపేట పరిధిలోని రంగధాంపల్లిలో దీక్షా స్థలికి బయలు దేరారు. అప్పటికే దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ అడుగులవైపు చూసింది. గంటగంటకూ మారిన పరిస్థితులు పరిణామాలను ఆనాటి ప్రభుత్వం డేగ కళ్లతో గమనించింది. అత్యంత రహస్యంగా ఆపరేషన్ చేపట్టింది. ఎవరికీ అనుమానం రాకుండా అరెస్టుల పర్వాన్ని కొనసాగించింది. నవంబర్ 29న ఉదయం కేసీఆర్ భవన్ నుంచి బయలు దేరిన కేసీఆర్‌ను దీక్షకు పంపుతున్నట్టు నటించిన పోలీసులు, పక్కా ప్లాన్ ప్రకారం అల్గునూర్ చౌరస్తా వద్ద అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఎదురుతిరిగిన ప్రజలను అడ్డు తప్పించి, రూట్లు మార్చి ఖమ్మం వరకు వాహనాలను పరుగులు పెట్టించారు. అయినా కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. ప్రభుత్వాలకు జంకలేదు. బెదిరింపులకు తలొగ్గలేదు. తాను అనుకున్న గమ్యాన్ని మద్దాడేందుకు ఏకంగా ఖమ్మం జైల్లోనే ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. అప్పుడు ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం తెలిసి యావత్ తెలంగాణ సమాజం రోడ్లపైకి వచ్చింది.
నిరసనలు, బంద్‌లు స్వచ్ఛదంగా జరిగాయి. బస్సులు, రైళ్లు స్తంభించిపోయాయి. లాయర్లు, ఇంజినీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలా నాలుగున్నర కోట్లమంది ఒక్కటై కేసీఆర్‌కు అండగా నిలిచారు. యావత్తు తెలంగాణ సమాజం పిడికిలి బిగించి రోడ్లపైకి రావడం.. ప్రభుత్వం కంట్రోల్ చేసే స్థాయి దాటిపోవడం.. కేసీఆర్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొనడం.. నిత్య ఆందోళనలతో తెలంగాణ అట్టుడుకడం.. వంటి పరిస్థితుల్లో ఆనాడు కేంద్రం దిగొచ్చింది. 2009 డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఉద్యమాన్ని మలుపుతిప్పి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో నిలిచిపోయింది. ఉద్యమ ప్రస్థానంలో బీఆర్ఎస్ చరిత్ర పడిలేసిన తరంగం వంటిది. ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడిందే తెలంగాణ రాష్ట్రం. కానీ, ప్రస్తుతం కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వేదికగా ఉద్యమ ప్రస్థానం తెలియకుండా చేయడానికి విష ప్రచారం చేస్తున్నాయి. నేటి యువతకు ఆనాటి ఉద్యమ ప్రస్థానం, కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి సాగించిన పోరును తెలియకుండా కుయుక్తులు పన్నుతున్నాయి. నిజానికి ఆంగ్లేయులను పారదోలి దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు దోహద పడిన పోరాటాలను ఎలా మననం చేసుకుంటున్నామో.. అలానే స్వరాష్ట్ర సాధనకు కారణమైన కేసీఆర్‌ను, ప్రజల ఆకాంక్షను సాధించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరహార దీక్ష చేపట్టిన 2009 నవంబర్ 29ని ప్రతి తెలంగాణ పౌరుడు ఒక్కసారైనా మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అప్పుడే ఉద్యమ చరిత్ర భావితరాలకు చేరడమేకాదు, భవిష్యత్ పోరాటాలకు ఒక దిక్సూచిగా నిలుస్తుంది.
తెలంగాణలో ఒక భావోద్వేగాన్ని రగిలించిన రోజు నవంబర్ 29. ఆ రోజు ఆమరణ దీక్ష కోసం వెళ్తున్న కేసీఆర్‌ను అల్గునూర్‌లో అరెస్ట్ చేయడం చరిత్రలో నిలిచి పోయింది. ఆనాడు తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టారు. తెలంగాణ ప్రజలు అండగా నిలిచారు. ఆ రోజు చేపట్టిన దీక్ష కారణంగానే తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పీటలు కదిలాయి. దీనిని తట్టుకోలేక పోయింది. డిసెంబర్ 9న విధిలేని పరిస్థితిలో ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేసింది. అందుకే నవంబర్ 29ని తెలంగాణ ఎప్పటికీ మర్చి పోదు. దీక్ష దివస్ పేరిట ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని నేటి తరానికి అందించే ప్రయత్నం చేస్తున్నాం.
తెలంగాణ కేసీఆర్ నడిపిన ఉద్యమం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం. 2009 నవంబర్ 29న ఆయన చేపట్టిన ఆమరణ నిరహార దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఆనాడు కేసీఆర్ దీక్షను అడ్డుకునేందుకు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అణిచివేసేందుకు సీమాంధ్ర పాలకులు, అన్ని పార్టీల అధినాయకులు చేసిన ప్రయత్నాలు తెలంగాణ ప్రజల ముందు ఫలించలేదు. కేసీఆర్ దీక్షా ఫలితంగానే అప్పటి కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. ఆనాడు చూపిన కేసీఆర్ తెగువ, ధైర్యం తెలంగాణ గడ్డపై ఎప్పటికీ నిలిచిపోతాయి. శనివారం దీక్షా దీవస్‌ను బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పాత్ర, ఆమరణదీక్ష తదితర అంశాలన్నింటినీ భవిష్యత్తు తరాలకు అందించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలి.
తెలంగాణ ఉద్యమాన్ని గెలిపించింది కేసీఆర్ దీక్ష. తెలంగాణ ప్రకటనను రప్పించి, రాష్ర్టాన్ని సాధించింది కేసీఆర్ దీక్ష. గల్లీ గల్లీనీ, వాడవాడనూ ఏకం చేసి, సకల జనులను గర్జించేలా చేసి ఢిల్లీని వణికించింది. నవంబర్ 29న కేసీఆర్ దీక్ష లేకుండా డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు. చరిత్రను మలుపుతిప్పిన రోజు కేసీఆర్ దీక్ష. ఆయన దీక్ష ఫలితం, ఉద్యమకారుల పోరాటం, ఎంతో మంది అమరుల త్యాగఫలమే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. దీక్ష దివస్ స్ఫూర్తిగా తెలంగాణ హక్కుల కోసం పోరాడుదాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి. జిల్లా నలుమూలల నుంచి తెలంగాణ ఉద్యమకారులు తరలిరావాలి.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అన్న నినాదంతో చేపట్టిన ఆమరణ దీక్ష ఢిల్లీ పీఠాన్ని కదిలించి, తెలంగాణ నేలకు విముక్తి కదిలించిన కార్యసాధకుడు కేసీఆర్. దశాబ్దాల తండ్లాటను కడతేర్చాలని, దగాపడ్డ బతుకులను దరిచేర్చాలని బైలెల్లిన ఉద్యమ సారథి ఆయన. స్వరాష్ట్ర సాధన కోసం రణనినాదమై గర్జించిండు. ఊరూవాడను ఏకం చేసిండు. ఆమరణ దీక్షతో ఉద్యమాన్ని మలుపుతిప్పిండు. రాష్ట్ర సాధనకు ప్రధానమైన ఘట్టం దీక్షా దివస్. దీంతోనే రాష్ట్ర సాధనకు బీజం పడింది. ఆ తర్వాత రగిలిన ప్రజా ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించింది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది.