Koya Sriharsha | మంథని, ఫిబ్రవరి 10: పెద్దపల్లి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంథనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. ఆనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలతో పాటు రామగుండం కార్పొరేషన్లో ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.
ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో 124వార్డులకు గాను రామగుండంలో ఏకగ్రీవమైన ఒక డివిజన్ మినహాయించి కాగా 123 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 123 వార్డుల్లో జరిగే ఎన్నికల్లో 470 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, రామగుండంలో 60డివిజన్లలో ఎన్నికలు జరుగుతుండగా ఎక్కువ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో 2400మంది ఉద్యోగులు విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించడంతో పాటు సమస్యాత్మకంగా ఉండే పోలింగ్ కేంద్రాల్లో బయట కూడ వీడియో రికార్డింగ్ చేయించడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలంతా కూడ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ మనోహర్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.