Saransh Jain : ఈమధ్య భారత సెలెక్టర్లు కుర్రాళ్లకు వరసగా అవకాశాలిస్తున్నారు. ప్రతిభకు పట్టం కడుతూ అంతర్జాతీయ క్రికెట్ కలను సాకారం చేస్తున్నారు. తాజాగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సరాన్ష్ జైన్ (Saransh Jain) ఇందుకు తాజా ఉదాహరణ. ఆల్‌రౌండరైన అతడు సెలెక్టర్ల పిలుపుకోసం ఏళ్లుగా ఎదురుచూశాడు. ఎట్టకేలకు 33 ఏళ్ల వయసులో లంక పర్యటనతో అతడు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న సరాన్ష్.. మాజీ క్రికెటరైన తన తండ్రి సుబోధ్ జైన్ (Subodh Jain) అడుగుజాడల్లో నడుస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు మంగళవారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో.. అతడి బదులు మధ్యప్రదేశ్‌కు చెందిన సరాన్ష్ జైన్‌కు అవకాశమిచ్చారు. అతడి తండ్రి సుబోధ్ జైన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న సరాన్ష్.. ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. మధ్యప్రదేశ్ తరఫున ఇరగదీస్తున్న ఈ 33 ఏళ్ల ఆల్‌రౌండర్ శ్రీలంక సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేయనున్నాడు.
16 wickets in 4 innings in last Duleep trophy
30 wickets in 13 innings in last Ranji trophyOverall 188 first class wickets at 27.30
Congratulations for maiden india callup Saransh pic.twitter.com/Qe5iicBhib
— Sawai96 (@Aspirant_9457) July 28, 2026
అయితే.. లంకపై ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని టీమిండియా భావిస్తోంది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు తుదిజట్టులో ఉండడం పక్కా కాబట్టి.. మూడో స్పిన్నర్‌గా మానవ్ సుతార్, సరాన్ష్ల మధ్య పోటీ తప్పదు. ఆగస్టు 15న భారత్, శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ మొదలవ్వనుంది.
Saransh Jain has earned his maiden Test call-up 👏
Take a look at the new off-spinner, who set the stage on fire with his stunning 5/49 in the Duleep Trophy final. 👌 pic.twitter.com/VIlTxFDhAy
— BCCI Domestic (@BCCIdomestic) July 28, 2026
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఫేవరెట్‌గా భావించే సరాన్ష్.. 33 ఏళ్ల వయసులో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. నేను అభిమానించే వారిలో అశ్విన్ ఒకడు. అతడిలానే నా క్రికెట్ కెరీర్‌ను అంకితభావంతో కొనసాగిస్తాను అని వెల్లడించాడీ ఆఫ్ స్పిన్నర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకూ 54 మ్యాచుల్లో 2,223 పరుగులు చేసిన అతడు.. బంతితో తిప్పేసి 188 వికెట్లు తీశాడు. 2014లో రంజీల్లో అరంగేట్రం చేసిన సరాన్ష్.. 2022 ఎడిషన్‌లో వెలుగులోకి వచ్చాడు. గత సీజన్లో 30 వికెట్లు, 518 పరుగులతో ఆకట్టుకున్నాడు. అలానే దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరఫున రెండు అర్ధ శతకాలు, 16 వికెట్లతో సత్తా చాటాడీ ఆఫ్ స్పిన్నర్.
భారత టెస్టు స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, బమ్రా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, సరాన్ష్ జైన్.