పెద్దపల్లి/ ముత్తారం, అక్టోబర్ 27: ముత్తారం కస్తూర్భా బాలికల పాఠశాలలో దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చెందుతున్నారు. అయితే, అస్వస్థతకు గల కారణాలను ఇంకా గుర్తించలేదు. ఫుడ్ పాయిజన్ జరిగిందా? లేక ఇటీవల పాఠశాల పరిధిలో కొట్టిన గడ్డి మందు ప్రభావం వల్ల ఈ పరిణామం చోటు చేసుకుందా.. అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ఇటీవల పాఠశాల పరిధిలో గడ్డి మందు కొట్టించినట్లుగా విద్యార్థినులు చెప్పారు. అదే గడ్డిని ఆదివారం విద్యార్థినులతో తొలగించారని, దాని ప్రభావం పిల్లలపై పడి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానిస్తుండగా, ఇవి గాక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్నది తేలాల్సి ఉంది. ముందుగా నలుగురు విద్యార్థినులు పొడి దగ్గు బారిన పడగా.. ఆ తర్వాత దాదాపు 60 మందికి విస్తరించింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో విషయం తల్లిదండ్రుల వరకు చేరింది. వారు వెంటనే స్కూల్కు చేరుకొని పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందగా, స్కూల్ యంత్రాంగం స్పందించింది. విద్యార్థినులను చికిత్స కోసం పెద్దపల్లి దవాఖానకు పంపిస్తూ వైద్యం అందేలా చూస్తున్నారు.