మహిళా దినోత్సవం కానుకగా రాష్ట్ర సర్కారు ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 15 సెంటర్లలో సేవలు ప్రారంభం కాగా, అంతటా విశేష స్పందన లభించింది. మొదటి రోజులు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లలో వేచి ఉండి మరీ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దవాఖానలో అంతా మహిళా సిబ్బందే కావడంతో మహిళలు తమ మనసు విప్పి.. తమకున్న అనారోగ్య సమస్యలు చెప్పుకున్నారు. ఆ మేరకు వైద్యులు ఓపికగా విని సలహాలు, సూచనలు చేశారు. అవసరమైనవారికి పలు రకాల పరీక్షలు చేయడంతోపాటు మందులు కూడా ఇచ్చారు. పరీక్షలు చేసుకున్న వారి వివరాలతో ‘పేషెంట్ రికార్డు’ను అందించగా, మహిళలు భరోసాగా వెనుదిరిగారు. సీఎం కేసీఆర్ తెచ్చిన ఈ కార్యక్రమం బాగుందని కితాబునిచ్చారు.
కరీంనగర్, మార్చి 14 (నమస్తే తెలంగాణప్రతినిధి) : రాష్ట్రంలో మహిళల బాగుకోసం, వారి సంక్షేమం కోసం ఇప్పటికే పలురకాల పథకాలను అమల్లోకి తెచ్చింది. అయితే.. తల్లిఆరోగ్యం బాగుంటునే ఇల్లు బాగుంటుందన్న ఆంశాలతోపాటు.. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న వాతారణ పరిస్థితులు, కాలానికి అనుగుణంగా పెరుగుతున్న వివిధ రకాల రోగాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ అనే వినూత్న కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న కరీనగర్ వేదికగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిద్వారా కలిగే ప్రయోజనాలను అయన వివరించి చెప్పారు. పలు రకాల అధ్యయనాలను చూస్తే.. మహిళలు ఎక్కువ ఏయే రోగాల భారిన పడుతున్నారో చెప్పారు. ఆ మేరకు ఎనిమిది రకాల పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా వంద కేంద్రాలను ఏర్పాటు చేయగా, భవిష్యత్‌లో మరిన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోనున్నది.
మనసువిప్పి.. వ్యాధి గురించి చెప్పుకుని..
నిజానికి మహిళలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే.. ప్రైవేటు దవాఖానలకు వెళ్లి చూపించుకునే ఆర్థిక స్థోమత లేక.. మగ వైద్యులకు తమ సమస్యలు చెప్పుకోలేక తమలోనే తాము కుమిలిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి అంశాలను నిశితంగా పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ కింద పలు వినూత్న నిర్ణయాలు తీసుకున్నది. ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రతి మంగళవారం కేవలం మహిళలకు మాత్రమే.. ఓపీ చూసేలా చర్యలు తీసుకున్నది. ఆరోజు.. అవసరమైన వైద్యులను అక్కడికి డిప్యూటేషన్ చేస్తుంది. నిజానికి ప్రస్తుతం ఎంపిక చేసిన కేంద్రాల్లో ఎక్కడా మహిళా వైద్యుల కొరత లేదు. అటెండర్ నుంచి వైద్యురాలు వరకు అంతా.. మహిళలే పనిచేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ తమ సమస్యను చెప్పుకోలేక పోయి న మహిళలు, ప్రస్తుతం నిర్భయంగా చెబుతున్నారు. ఒక మహిళ తోటి మహిళ సమస్యను అర్థం చేసుకుంటుందన్న భావనతో వివిధ పరీక్షల కోసం వచ్చినవారు మనసు విప్పి మాట్లాడుతున్నారు. తాము ఎన్నాళ్లుగా ఆ సమస్యలను ఎదుర్కొంటున్నారో చెపుతూ.. వైద్యుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. సమస్య పరిష్కారం కాలేని పరిస్థితుల్లో జిల్లాకేంద్రంలోని దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు.
పేషెంట్ రికార్డు
వైద్యం కోసం ‘ఆరోగ్య మహిళ’ కేంద్రానికి వచ్చిన ప్రతి మహిళకు పేషెంట్ రికార్డు పేరుతో ముద్రించిన ఒక బుక్‌లెట్‌ను ఇస్తున్నారు. ఇందులో పేషెంట్ తాలుఖా పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. అంతేకాదు.. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే వివిధ రకాల క్యాన్సర్, లైంగిక వ్యాధులు, మూత్ర నాళ సంబంధిత వ్యాధులు, గర్భాశయ క్యాన్సర్, మోనోపాజ్ వంటి వాటి గురించి.. పేషెంట్ రికార్డు బుక్‌లెట్‌లోనే ముద్రించారు. ఆ వ్యాధులు రావడానికి గలకారణాలు, ఆ వ్యాధులు వచ్చాయని తెలుసుకునేందుకు ఉండే లక్షణాలు, వాటి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల వంటి అంశాలను ముద్రించారు. అలాగే మధు మేహం, రక్తపోటు, థైరాయిడ్, క్యాన్సర్, గుండెజబ్బు, కిడ్నీవ్యాధులు, తదితర వ్యాధులకు సంబంధించి గత చరిత్రతోపాటు, కుటుంబ వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాదు.. సంబంధిత వ్యా ధులకు సంబంధించి ఇప్పటికే వాడుతున్న మందుల వివరాలను పరిశీలించి.. ప్రస్తుతం వాడుకోవాల్సిన మందులు, ఇతర పరీక్షల వివరాలను దవాఖానలకు వచ్చిన మహిళలకు తెలుపుతున్నారు.
సుందరయ్యనగర్‌లో..
సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు మహిళలకు వైద్య సేవలందిస్తున్నారు. సుందరయ్యనగర్, బీవైనగర్, తారకరామారావు నగర్, ప్రగతినగర్, శివనగర్ వార్డులకు చెందిన మహిళలకు డాక్టర్ ప్రింయాక వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలో 9మంది వైద్య సిబ్బంది ఉన్నారు. వైద్యరాలు, ఫార్మసిస్టు, స్టాఫ్‌నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఐదుగురు ఏఎన్ఎంలు మంగళవారం 50మందికి పరీక్షలు చేశారు. ఐదుగురికి సర్వైకల్ క్యాన్సర్, పది మందికి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయగా, అందరికి నెగిటివ్ వచ్చింది. మిగిలిన వారికి జ్వరం, బాడీపెయిన్స్ ఉండడంతో మందులు ఇచ్చి పంపించారు.
– రాజన్న సిరిసిల్ల మార్చి 14 (నమస్తే తెలంగాణ)
చల్లూరులో 98 మందికి పరీక్షలు
వీణవంక మండలం చల్లూరు పీహెచ్‌సీలోని ఆరోగ్య మహిళ కేంద్రంలో సుమారు 98 మంది వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. ఇక్కడ ఆరుగురు సిబ్బందితో పాటు సుమారు 10 మంది ఆరోగ్య కార్యకర్తలు 6 గంటల పాటు విధులు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్, సూక్ష్మ పోషకాలలోపం, స్ట్రిప్ విధానం ద్వారా యూటీఐ పరీక్ష, మెనోపాజ్ నిర్వహణ, అనుమానిత పీసీఓడి, వంధ్యత్వ సమస్యలు, అనుమానిత ఎస్టీఐ, బరువు నిర్వహణ సమస్యలు వంటి పరీక్షలు చేశారు.
– వీణవంక, మార్చి 14
పెద్దపల్లిలో 30 మందికి స్క్రీనింగ్
పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చీకురాయి ఎక్స్‌రోడ్డులో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మొదటి రోజు మహిళలు తరలివచ్చారు. డాక్టర్ వెంపాలి స్వప్న ఆధ్వర్యంలో సిబ్బంది వైద్య పరీక్షలు చేశారు. ఈ వారం 30 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. 15 మందికి సంబంధించిన శాంపిల్స్‌ను కరీంనగర్‌లోని టీ డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.
– పెద్దపల్లి, మార్చి 14(నమస్తే తెలంగాణ)
కొడిమ్యాలలో
జగిత్యాల కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ కేంద్రాన్ని కలెక్టర్ యాస్మిన్ బాషా సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళ రక్షణకే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో 8 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆరోగ్య కేంద్రంలో నయం కాని వాటికి జగిత్యాల మెడికల్ కళాశాలకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు పంపించి వైద్య పనీక్షలు చేయించనున్నట్లు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 72 మంది మహిళలు వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు వైద్యాధికారి తెలిపారు. – కొడిమ్యాల, మార్చి 14
చొప్పదండిలో
చొప్పదండిలో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని పరిశీలించారు. మెడికల్ అధికారితో పాటు వైద్య పరీక్షలు చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ అంతా మహిళా సిబ్బందే పని చేయడంతో మహిళలు తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మధుమేహం, రక్తపోటు, ఇతర సాధారణ పరీక్షలు చేశారు. ఓరల్, సర్తెకల్, రొమ్ము క్యాన్సర్, స్క్రీనింగ్, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలు గుర్తించారు. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.
– చొప్పదండి, మార్చి14
ఓపిగ్గా వేచి ఉండి.. పరీక్షలు చేయించుకుని..
బుట్టిరాజారాం కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మహిళలు ఓపికగా వేచి ఉండి.. వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలుసుకున్న స్థానిక మహిళలు వచ్చి తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకున్నారు. ఈ కేంద్రాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సందర్శించారు. మహిళల్లో 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించేందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని, ప్రతి మహిళలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సెంటర్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జువేరియా సందర్శించి మహిళలకు అవగాహన కల్పించారు. సెంటర్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జువేరియా సందర్శించి మహిళలకు అవగాహన కల్పించారు.
– విద్యానగర్, మార్చి 14
ఐలాపూర్‌లో విశేష స్పందన
కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ కేంద్రాన్ని ప్రారంభించగా మంగళవారం మహిళలు వైద్య పరీక్షల కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సమీనా తబస్సుం మహిళలకు బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు, కిడ్నీ సంబంధిత, రక్త, మూత్ర రీక్షలను నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు.
– కోరుట్ల రూరల్, మార్చి 14
వేములవాడ ఆరోగ్య కేంద్రంలో..
వేములవాడ పట్టణంలోని ఏరియా దవాఖానలో ఆరోగ్య మహిళా కేంద్రం నిర్వర్తిస్తున్నారు. ఈ కేంద్రంలో వైద్యురాలు దివ్యశ్రీ ఆధ్వర్యంలో ఒక మహిళా వైద్యురాలు, ముగ్గురు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశ కార్యకర్తలు వైద్య సేవలందిస్తున్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు పరీక్షలు చేస్తున్నారు. మంగళవారం 51మందికి బీపీ, షుగర్, రక్తహీనత క్యాన్సర్ వంటి పరీక్షలు చేశారు. ఒక మహిళకు క్యాన్సర్ లక్షణాలు కనిపించగా, సిరిసిల్ల ఏరియా దవాఖానకు రెఫర్ చేశారు.
– రాజన్న సిరిసిల్ల మార్చి 14 (నమస్తే తెలంగాణ)
90 మందికి పరీక్షలు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 90 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. అనంతరం డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. – జగిత్యాల అర్బన్, మార్చి 14
నేరెళ్ల ఆరోగ్య కేంద్రంలో..
తంగళ్లపల్లి మండలం నెరేళ్లలోని ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వైద్యురాలు జిందం రేఖ ఆధ్వర్యంలో ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఆరుగురు ఏఎన్ఎంలు, ఇద్దరు సూపర్వైజర్లు, ఒక ల్యాబ్ టెక్నిషీయన్, ఒక ఫార్మాసిస్టు వైద్య సేవలందిస్తున్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య పరీక్షలు చేశారు. మంగళవారం 45మంది మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. 13మందికి వీఐఏ స్క్రీన్నింగ్, 20మందికి ఓరల్ స్కానింగ్, 12మందికి బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ముగ్గురు మహిళలను వివిధ పరీక్షల కోసం సిరిసిల్ల ఏరియా దవాఖానకు రెఫర్ చేశారు.
– రాజన్న సిరిసిల్ల మార్చి 14 (నమస్తే తెలంగాణ)
తంగళ్లపల్లిలో
తంగళ్లపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కేంద్రం నిర్వర్తిస్తున్నారు. డాక్టర్ స్నేహ ఆధ్వర్యంలో ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఒక ఫార్మాసిస్టు, ఇద్దరు సూపర్వైజర్లు, ల్యాబ్‌టెక్నీషియన్ డ్యూటీ చేస్తున్నారు. మంగళవారం కేంద్రానికి వచ్చిన 51మంది మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. 26మంది నుంచి రక్త నమూనాలు తీసుకుని తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపించారు. ఒక మహిళకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉండవచ్చన్న అనుమానంతో ఏరియా దవాఖానకు రెఫర్ చేశారు. మిగిలిన వారికి జ్వరం, థైరాయిడ్ ఇతర సమస్యలున్నట్లు గుర్తించి మందులు ఇచ్చారు.
– రాజన్న సిరిసిల్ల మార్చి 14 (నమస్తే తెలంగాణ)
బిట్టుపల్లి పీహెచ్సీలో..
మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు డాక్టర్ శంకరాదేవి ఆధ్వర్యంలో సిబ్బంది అందుబాటులో ఉండి చికిత్సలు నిర్వహించారు. మధ్యాహ్నం వరకు 62 మందికి పరీక్షలు నిర్వహించారు. మొదటగా మహిళకు సంబంధించిన వ్యాధులను గుర్తించేందుకు బ్లడ్ టెస్ట్, ఘుగర్ టెస్ట్ట్, థైరాయిడ్ టెస్ట్, లివర్ టెస్టు, రినాల్ ఫంక్షన్ టెస్ట్ట్, మైక్రోబయాలజీ టెస్టు, లుపిడ్ ప్రొఫైల్‌లతో పాటు పలు రకాల టెస్టులు చేశారు. మొత్తం 9 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు.
– పెద్దపల్లి, మార్చి 14(నమస్తే తెలంగాణ)
పరీక్షలు చేసి.. మందులు అందించి..
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల పీహెచ్సీలో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు 38 మంది మహిళలు వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు అవంతి, శివకుమారి, స్టాఫ్ నర్సు శ్యామల మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవరసమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఇందులో మూత్రకోశ మరియు గర్భకోశ సంబందిత సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు మహిళలను గుర్తించి మెరుగైన వైద్యసేవల కోసం జిల్లా దవాఖానకు రిఫర్ చేశారు. 36 మందికి పలు రకాలైన పరీక్షలు నిర్వహించారు.
– ధర్మపురి, మార్చి 14
రామగుండం ఆరోగ్య కేంద్రంలో..
రామగుండం నియోజకవర్గంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఇందులో 52మంది మహిళలు ప్రత్యేకంగా వైద్య సేవలను పొందారు. వీరిలో గత వారం 12 మందిని, ఈ వారం 16 మందికి సంబంధించిన శాంపిల్స్‌ను తీసుకొని కరీంనగర్‌లోని టీ డయాగ్నాస్టిక్కు పంపించారు. ఇక్కడ 15 మంది మహిళా వైద్య సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ మాధురితో పాటుగా ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ల్యాబ్ టెక్నీషియన్లు సేవలందిస్తున్నారు. – పెద్దపల్లి, మార్చి 14(నమస్తే తెలంగాణ)