గంగాధర, అక్టోబర్ 2: ‘ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపింది. 420 హామీలు ఇచ్చి నమ్మించి గెలిచింది. అధికారంలోకి వచ్చి ఇప్పటికి 300 రోజులు అవుతున్నది. హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తరు’ అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. బుధవారం మధురానగర్‌లో విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు తీయని మాటలు చెబుతూ అందలం ఎక్కిందన్నారు. ఆరు గ్యారెంటీలలో ఫ్రీ బస్ మినహా మిగతా వాటన్నింటికి మంగళం పాడిందని విమర్శించారు. రేంవత్‌రెడ్డి సర్కారు హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూల్చి వారి ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. హైడ్రాపై ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ స్పందించకపోవడం శోచనీయమన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా తాను మహాత్మాగాంధీని ఒక్కటే కోరుకుంటున్నానని, సీఎం రేవంత్‌రెడ్డికి కనువిప్పు కలిగించి ఆరు గ్యారంటీలు అమలు చేసేలా చూడాలని వేడుకున్నట్టు చెప్పారు. అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, నాయకులు సాగి మహిపాల్‌రావు, ఆకుల మధుసూదన్, మడ్లపెల్లి గంగాధర్, కంకణాల విజేందర్‌రెడ్డి, వేముల అంజి, శ్రీమల్ల మేఘరాజు, వేముల దామోదర్, వడ్లూరి ఆదిమల్లు, జోగు లక్ష్మీరాజం, లింగాల దుర్గయ్య, దోమకొండ మల్లయ్య, గంగాధర కుమార్ ఉన్నారు.