Scientist Satish Chandra | అంతర్గాం, అక్టోబర్ 15: ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు వ్యాపిస్తున్న వరి పంటలో తెగుళ్లకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సతీష్ చంద్ర అన్నారు. నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం కార్యక్రమం లో భాగంగా అంతర్గాం మండలంలోని బ్రాహ్మణపల్లి, ఆకనపల్లి, ఎగ్లాస్పూర్ గ్రామాలలోని వరి పొలాలను బుధవారం పరిశీలించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు వ్యాపిస్తున్న వరి పంట లోని తెగుళ్లకు తీసుకోవాలసిన జాగ్రత్తలు రైతులకు వివరించారు. వరిలో కంకి నల్లి నివారణకు స్పైరోమెసిఫిన్ మందును ఎకరానికి 150 ఎంఎల్ పిచికారీ చేయాలన్నారు. రైతులు పండించిన నాణ్యమైన విత్తనాన్ని గ్రామంలోని ఇతర రైతులు కూడా సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు హరీష్, రమేష్, రైతులు పాల్గొన్నారు.