కలెక్టరేట్, జనవరి 29: ‘ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు తీసుకోలేదని.. వృద్ధాప్యంలో ఉన్న తనను కొడుకు పట్టించుకోవడం లేదని.. అమ్మిన భూమికి డబ్బులు ఇవ్వడంలేదని..’ఇలా సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన 207 మంది నుంచి అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ అర్జీలు తీసుకున్నారు.
ఇందులో కొన్నింటిపై వెంటనే స్పందించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారంవారం వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. కాగా, ప్రజావాణికి వచ్చిన పలువురిని పలుకరించగా తమ గోడు వెళ్లబోసుకున్నారు.