ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తుతున్నాయి.. ఏ జిల్లాలో చూసినా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి.. అయితే పరిష్కారంలో జాప్యంతో ఎదురుచూపులే మిగులుతున్నాయి. ప్రతి సోమవారం అర్జీలు పెట్టుకోడం, పరిష్కారం ఆలస్యం అవుతుండడంతో అర్జీదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు అప్పుడూ ఇప్పుడూ అంటూ కాలయాపన చేస్తుండడంతో తిరిగీ తిరిగీ వేసారిపోతున్నారు. ఒక సమస్య పరిష్కారం కోసం ఎన్నిసార్లు ఆర్జీలు ఇవ్వాలని వాపోతున్నారు. పేదోళ్లకు న్యాయం చేయని అధికారులు ఉండెందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏం పాలన చేస్తున్నదని నిలదీస్తున్నారు.
– కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 12
నాది సర్వారెడ్డిపల్లి. మా తండ్రి నుంచి నాకు వారసత్వంగా రావాల్సిన భూమిలో 27 గుంటలు ఇతరుల పాసుబుక్కులో నమోదైంది. దీనిపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన. ఎవరూ పట్టించుకోలేదు. ఇదేంటని అడిగితే నన్నే బెదిరిస్తున్నరు. ఇప్పటికీ మూడు సార్లు ప్రజావాణిలో అర్జీ ఇచ్చిన. పోయిన నెల 8వ తారీఖున ప్రజావాణికి నేను, నాభార్య పురుగుల మందు డబ్బాతో వచ్చినం. అధికారులు గమనించి, తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన్రు. నెల దాటింది. ఇప్పటివరకు మాకు ఎలాంటి న్యాయం జరుగలే. దీనిపై డీఆర్వోను అడిగితే, తహసీల్దార్‌ను అడుగాలంటున్నడు. మాలాంటి పేదోళ్లకు న్యాయం చేయని అధికారులు ఉండెందుకు? డ్యూటీలు చేసుడెందుకు? పురుగుల మందు తాగుతమన్నా కూడా వారిలో మార్పు లేదు. ప్రభుత్వం ఏం పాలన చేస్తున్నట్టు?
– ఒగ్గు రాజమల్లు, సర్వారెడ్డిపల్లి (గంగాధర)
రుణమాఫీ ఎందుకు కాలేదు
నాకు దుర్శేడ్‌లో మూడెకరాలు ఆరుగుంటల ఎవుసపు భూమి ఉన్నది. నేను చాలా ఏండ్ల సంది రుణం తీసుకుంటున్న. తిరిగి చెల్లిస్తున్న. ఏడాది కింద 1.30లక్షల వ్యవసాయ రుణం తీసుకున్న. సర్కారు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే సంబురపడ్డ. కానీ, మాకు మాత్రం రుణమాఫీ కాలే. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాకు రుణమాఫీ అయింది. ఇప్పుడెందుకు కాలేదో అధికారులే చెప్పాలే. మూడో విడతలోనైనా రుణమాఫీ చేయాలే.
– ఆలేటి లక్ష్మి, దుర్శేడ్ (కరీంనగర్ రూరల్ మండలం)
డయాగ్నొస్టిక్ సెంటర్లపై కొరడా ఝులిపించాలి
కరీంనగర్ జిల్లాకేంద్రంలో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్ల సిండికేట్ అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నది. గతంలో కంటే 30శాతానికి పైగా ధరలు పెంచిన్రు. తమ వద్దకు పంపే వైద్యులు, ఇతరులకు కమీషన్లు ఇస్తున్రు. పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఈ సెంటర్ల దోపిడీతో అనేక బాధలు పడుతున్రు. దీనిపై ఇప్పటికే పలుసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినం. అయినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా వెంటనే స్పందించాలి. సిండికేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలపై కొరడా ఝులిపించాలి. దోపిడీకి అడ్డుకట్ట వేయాలి.
– గీట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేశ్, సీఐటీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు